కొత్తిమీర (Coriander) అనేది మన వంటల్లో రుచి, వాసనను పెంచే అద్భుతమైన ఆకుకూర. దీన్ని చాలా మంది మార్కెట్లో కొనుగోలు చేస్తుంటారు. కానీ నిజానికి ఇంట్లోనే తక్కువ శ్రమతో కొత్తిమీరను సులభంగా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకుంటే ఎప్పుడైనా తాజా కొత్తిమీరను వంటల్లో వాడుకోవచ్చు. పైగా దీని కోసం ఎక్కువ ఖర్చు అవసరం ఉండదు. కేవలం కొద్దిగా సమయం, కొద్దిగా శ్రద్ధ సరిపోతుంది.
తక్కువ సమయంలో పెరిగే మొక్క: కొత్తిమీరను నాటిన 5 రోజులకే మొలకలు వస్తాయి. వారంలోపే వంటల్లో ఉపయోగించడానికి సరిపడా ఆకులు పెరుగుతాయి. కొద్దిపాటి శ్రమతో, తక్కువ సమయంలోనే ఇది సాధ్యమవుతుంది.
గింజలు: ముందుగా ధనియాల గింజలను తీసుకుని ఒక రోజు ఎండలో ఆరబెట్టాలి. తర్వాత స్వల్పంగా నలిపి రెండు భాగాలుగా చేయాలి. ఈ గింజలను 24 నుంచి 48 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత తేమ ఉన్న నేలలో 1–2 అంగుళాల లోతులో వేయాలి.
కుండీల్లో పెంచే పద్ధతి: ప్లాస్టిక్ టబ్ లేదా చిన్న కుండీ తీసుకుని సగం వరకు మట్టితో నింపాలి. అందులో గింజలు వేసి స్వల్పంగా నీరు పోయాలి. కుండీ ఎండతగిలే ప్రదేశంలో ఉండాలి. నేల ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు.
సహజ ఎరువుల వాడకం: టీ పొడి, కూరగాయల మిగులు నీటిని ఒకరోజు ఉంచి తదుపరి రోజు మొక్కల దగ్గర పోయాలి. ఇది వేర్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. రసాయన ఎరువుల అవసరం లేకుండా సహజంగా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
పోషకాలు: కొత్తిమీరలో విటమిన్ A, C, K, ఫోలిక్ యాసిడ్ తో పాటు ఐరన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటు, చర్మం, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.
ఇలా ఇంట్లోనే పెంచిన కొత్తిమీరతో మీరు ఎప్పుడైనా తాజా ఆకులు వాడుకోవచ్చు. కలుషితాలు లేకుండా ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది మంచి మార్గం.