ఇప్పటివరకు కొబ్బరినూనెను (Coconut Oil) ఎక్కువగా జుట్టు సంరక్షణకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్య అవగాహన పెరగడంతో, దాని పోషక విలువలను తెలుసుకుని వంటల్లో కూడా వాడుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉండటంతో శరీరానికి, చర్మానికి, జుట్టుకి అనేక లాభాలు కలుగుతాయి.
కల్తీ నూనెల సమస్య: మార్కెట్లో నేడు నిజమైన వస్తువుల కంటే కల్తీ ఉత్పత్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే పరిస్థితి కొబ్బరినూనె విషయంలో కూడా ఉంది. కొందరు వ్యాపారులు కల్తీ నూనెను అసలైనదిగా విక్రయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
వేడి పరీక్ష: కొద్దిగా నూనెను ఒక పాన్‌లో వేసి సిమ్ మంటపై వేడి చేయండి. నూనె నుంచి సహజమైన సువాసన వస్తే అది శుద్ధమైనదే. కాలిన వాసన వచ్చినా లేదా రంగు మారినా అది కల్తీ అని అర్థం.
ఫ్రీజర్ టెస్ట్: కొద్దిగా నూనెను ఓ సీసాలో వేసి ఒక గంట పాటు ఫ్రీజర్‌లో (Freezer) ఉంచండి. నూనె పూర్తిగా గడ్డకట్టితే అది అసలైనది. పై పొరలా విడిపోతే కల్తీగా గుర్తించాలి.
నీటిలో పరీక్ష: ఒక గ్లాస్‌లో నీరు తీసుకుని రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. కొద్దిసేపటికి నూనె ఘనీభవిస్తే అసలైనదే. నీటిలో కరిగిపోతే అది కల్తీ నూనె.
వాసన, రంగు: నిజమైన కొబ్బరినూనె తెల్లగా , తేలికైన సువాసన కలిగి ఉంటుంది. కల్తీ నూనె పసుపు రంగులో లేదా ఘాటైన వాసనతో ఉంటుంది.
గమనిక: ఇవి గృహ పరీక్షలు మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని (Doctor) సలహా తీసుకోవడం మంచిది.