అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ!
సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని, పోలీసుల విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును ఆపలేమని స్పష్టం చేస్తూ, విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో అషు రెడ్డి మోసం వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు వై.వి.ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో ధర్మేంద్రకు అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అషురెడ్డి, వివిధ కారణాలు చెపుతూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్ రావు వీరమల్ల కీలక విషయాలను కోర్టుకు వివరించారు. నిందితురాలికి, బాధితుడికి మధ్య సుమారు 10.5 కోట్ల రూపాయల నగదు బదిలీ జరిగిందని, ఈ లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారానే జరిగాయని సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. కేవలం నగదు మాత్రమే కాకుండా, ధర్మేంద్ర డబ్బుతో అషురెడ్డి బంగారం, కారు, ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేసిందని, వాటన్నింటినీ తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకుందని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ క్రమంలోనే అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగి, పెళ్లి సంబంధాన్ని ఖరారు చేస్తున్నామంటూ పండితుడిని పిలిపించి హడావుడి చేశారని, కానీ తీరా సమయం వచ్చేసరికి అషురెడ్డి ముఖం చాటేసిందని ఫిర్యాదులో వివరించారు. అంతేకాకుండా, అషురెడ్డి సోదరి కూడా సుమారు రూ. 50 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును కొట్టివేయాలని అషురెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, కేవలం ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ ముగిసేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు.
అయితే జస్టిస్ జె. శ్రీనివాసరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ అభ్యర్థనలను తోసిపుచ్చింది. పోలీసుల వద్ద తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఇప్పటికే నిందితురాలికి 41ఏ నోటీసులు జారీ చేశారని కోర్టు గుర్తించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అషురెడ్డితో పాటు ఆమె తల్లిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ప్రతివాదులను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేయడంతో, అప్పటివరకు అషురెడ్డికి పోలీసు విచారణ నుంచి ఊరట లభించే అవకాశం లేదు. పెళ్లి పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారన్న ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి








