Andeshri: అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు
అక్షర యోధుడు, సహజ కవి అందెశ్రీ (Andeshri)(64) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అధికార లాంఛనాలతో ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో ఆయన కుమారుడు దత్తు (Dattu), అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. హైదరాబాద్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్ వరకు అంతిమయాత్ర సాగింది. ఘట్కేసర్ నుంచి ఖననం చేసే ప్రదేశం వరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం పాడె మోసి అందెశ్రీపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సీఎంతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) కూడా పాడె మోశారు. అందెశ్రీ ఆకస్మిక మరణంతో బరువెక్కిన హృదయాలతో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓదార్చారు. అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.







