Pawan Kalyan: చేనేత రంగానికి అన్నివిధాలా అండగా ఉంటాం: పవన్ కల్యాణ్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. చేనేత మన సంస్కృతి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలు, కళాకారుల సృజనాత్మకతకు చిహ్నమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అసంఘటిత రంగాలలో చేనేత (Handloom Sector) ముఖ్యమైనదని పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ముఖ్య నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పారు. సొసైటీల నుంచి ఆప్కో కొనుగోలు చేసే వస్తువులపై 5% జీఎస్టీ రాయితీని అమలు చేయడంతో పాటు, త్రిఫ్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడతామని, యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరిస్తే ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిప్రాయపడ్డారు.







