Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) కలకలం రేగింది. ఇద్దరు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ పరికరాలను సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3 కోట్లుగా గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Airport) నిత్యం హడావుడిగా ఉంటుంది. విమానాశ్రయంలో భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడిని, వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు అధికారులు. ఈ క్రమంలో అబుదాబీ నుంచి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు.
అయితే వారు అనుమానంగా కనిపించడంతో వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి ప్రయాణికుల లగేజ్ బ్యాగ్‌లను తనిఖీలు చేయగా, మూడు కోట్ల విలువ చేసే డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఐ ఫోన్లను గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఇద్దరు ప్యాసింజర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులు సూర్య ప్రకాష్, మహమ్మద్ జాంగిర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన విమానాశ్రయ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అసలు ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు తీసుకువచ్చారు? ఎలా తీసుకువచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై ఎయిర్‌పోర్టు అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నారు.







