AP Liquor Scam: లిక్కర్ స్కాం లో హాల్ చల్ చేస్తున్న కూటమి నేతల ఫోటోలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లిక్కర్ స్కాం (Liquor Scam) ప్రస్తుతం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఏ34 వెంకటేశ్ నాయుడు (Venkatesh Naidu) అనే వ్యక్తి పేరు బయటకు రావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. సిట్ (SIT) దర్యాప్తులో ఆయన ఫోన్ నుండి వచ్చిన కొన్ని వీడియోలు, ఫొటోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
వీటిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (TDP) ముఖ్య నేతలతో ఉన్న ఫొటోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన రాజకీయ ఆయుధంగా మారాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తో వెంకటేశ్ నాయుడు ఉన్న చిత్రాలను ప్రదర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. ఈ స్కాం వెనుక ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్లో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, ఆ ఫొటోలు మాత్రం రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సహచరులకు ఒక హెచ్చరిక చేసినట్టు సమాచారం. ఎవరి తో ఫొటోలు దిగుతున్నారో ముందుగా ఆ వ్యక్తి నేపథ్యం తెలుసుకోవాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. వెంకటేశ్ నాయుడు వ్యక్తిగతంగా ఎవరో చంద్రబాబుకు అప్పటివరకు తెలియదని, కానీ తనతో ఉన్న ఫోటో బయటకు రావడంతో షాక్ అయ్యారని అంటున్నారు. అలాగే వెంకటేశ్ నాయుడుకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu), మంత్రి నారా లోకేశ్ తోపాటు మరికొంతమంది టిడిపి నేతలతోనూ కనిపించారు. ఇదే సమయంలో తెలంగాణ (Telangana) లోని బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన కొంతమంది నాయకులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
డబ్బు కట్టలు లెక్కపెడుతున్న వీడియో బయటకు వచ్చిన తర్వాత,అతని ఫొటోలు మరింతగా సోషల్ మీడియాలో పాకాయి. రెండు రాష్ట్రాల్లోని పలు కీలక నేతలతో ఆయన ఫొటోలు ఉండటంతో, ఆయన అసలు నేపథ్యం ఏమిటన్న ఆసక్తి పెరిగింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం సేఫ్గా బయటపడ్డారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
సుమారు పదేళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, వెంకటేశ్ నాయుడు ఎప్పుడూ ఆయనను కలవలేదా, లేక పవన్ ముందుగానే ఆయన గురించి తెలుసుకుని అపాయింట్మెంట్ ఇవ్వలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా ముఖ్య నాయకుల వద్దకు అనేక మంది కలిసేందుకు వస్తుంటారు. అందులో భాగంగా ఈ స్కాం నిందితుడు కూడా తన ప్రయోజనాల కోసం పలు పార్టీల నేతలతో కలిసినట్లు చెబుతున్నారు. కానీ పవన్ వద్దకు మాత్రం వెళ్లకపోవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.







