Vizag: దేశానికి విశాఖ గ్రోత్ ఇంజన్.. సీఐఐ సదస్సులో ప్రముఖుల ప్రశంసలు
విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల జాతర మొదలైంది. సాగర తీర నగరంలో రెండు రోజుల పాటూ నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు..దేశ, విదేశాల నుంచి నుంచి అధికసంఖ్యలో పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. విశాఖపట్నంలో సీఐఐ సదస్సు సందడి కనిపిస్తోంది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య)తో కలిసి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దేశ, విదేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు 15 సమావేశాల్లో పాల్గొని ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అయితే సదస్సుకు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 అవగాహన ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజులు మరిన్ని ఒప్పందాలు జరుగుతాయని చెబుతున్నారు.
చంద్రబాబు విజనరీ లీడర్: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఏపీలో ప్రశాంతమైన వాతావరణం ఉందని.. వ్యాపార అనుకూల రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. మళ్లీ రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయన్నారు. చంద్రబాబు మూడు దశాబ్దాలుగా తనకు స్నేహితుడని.. ఆయన సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. లక్ష్యం పెట్టుకోవడం సులభం.. అక్కడికి చేరుకోవడం కష్టమన్నారు.
ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్‌వే: చంద్రబాబు
విశాఖపట్నానికి దేశంలోనే అందమైన నగరంగా పేరుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్‌వేలా మారుతోందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో తెలుగువాళ్లే ముందుంటారన్నారు. ఏపీకి డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయన్నారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు.






