Handloom: అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం : చంద్రబాబు
భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి(Amaravati) లో హ్యాండ్లూమ్ మ్యూజియం (Handloom Museum) ఏర్పాటు చేస్తామని తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉంది. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ (NTR). వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. 55,000 మంది చేనేత కార్మికులకు రూ.2 లక్షలు చొప్పున రూ.27కోట్లు రుణాలు ఇచ్చాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించాం. చిన్నవయసులోనే అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. అందుకే 50 ఏళ్లకే పింఛన్ తీసుకొచ్చాం. 50 శాతం సబ్సిడీతో మర మగ్గాలకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల నుంచే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాం. మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది అని అన్నారు.







