Chandrababu : సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ బాబు గారూ..!!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) నాయకత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయితే చంద్రబాబు (CM Chandrababu) పరిపాలనపై విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ, పరిపాలనలో అనేక సవాళ్లు, అసమర్థత ఆరోపణలు, అంతర్గత విభేదాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. అమరావతి, పోలవరం, లిక్కర్ స్కాం, ఇండోసోల్, సూపర్ సిక్స్ హామీలు, వివేకా హత్య కేసు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచే అసమర్థత ఆరోపణలు మొదలయ్యాయి. టీడీపీ అనుకూల వ్యక్తులుగా పేరున్న ఏబీ వెంకటేశ్వర రావు, నిమ్మగడ్డ రమేశ్ వంటి వారు ప్రభుత్వ తప్పిదాలను బహిరంగంగా ఎత్తి చూపుతున్నారు. తాజాగా టీడీపీ న్యాయవిభాగంలో జరుగుతున్న అక్రమాలపై పార్టీ న్యాయవాదులే ఆరోపణలు చేశారు. అటార్నీ జనరల్ (AG) దమ్మాలపాటిపై నేరుగా విమర్శలు గుప్పించారు. ఈ వివాదాలు హైకమాండ్‌కు తెలిసి జరుగుతున్నాయా లేక తెలియకుండా జరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. తెలిసి జరుగుతుంటే, దానిపై చర్చించడం వ్యర్థమని, తెలియక జరుగుతుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తీకరణ కోసం కేంద్రం నుంచి రూ.15,000 కోట్లు, రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ, ఈ ప్రాజెక్టులు ఆశించిన వేగంతో సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం గత ఐదేళ్లుగా స్తంభించి ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తొలిదశ పనులు పూర్తి కాకముందే రెండో విడతగా మరో 40 వేల ఎకరాలు భూసేకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను చాలా మంది తప్పుబడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ, పనులు ఊపందుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఇది ఎప్పటికి పూర్తవుతుందోననే సందేహాలు మొదలయ్యాయి. చంద్రబాబు కూడా పోలవరంపై గతంలో లాగా శ్రద్ధ చూపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో సోమవారం పోలవారం పేరుతో చంద్రబాబు రివ్యూ చేసేవారు. దీంతో పనులు చకచకా సాగాయి. కానీ ఇప్పుడు అది కొరవడింది.
లిక్కర్ స్కాంపై దర్యాప్తు, ఇండోసోల్ సంస్థతో సంబంధిత ఆరోపణలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతున్నప్పటికీ, ఈ కేసుల్లో పారదర్శకత లోపించిందని, ఫలితాలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. వివేకా హత్య కేసు విషయంలోనూ పురోగతి లేకపోవడం ప్రభుత్వానికి మరో సవాలుగా నిలిచింది. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పైన కూడా అనుకున్నంత పాజిటివ్ టాక్ రావట్లేదు. ఒకటి, రెండు మినహా మిగిలిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేశామని ప్రభుత్వం చెప్తోంది. మహిళలకు ఆర్థిక సాయం, యువతకు ఉద్యోగ అవకాశాలు అమలులో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో టీడీపీ అనుకూలవాదులు, పార్టీ కార్యకర్తలు సైతం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. సొంత మీడియా సంస్థలు కూడా అడపాదడపా ప్రభుత్వ తప్పిదాలను వెల్లడిస్తున్నాయి. ఎమ్మెల్యేల అవినీతి, మంత్రుల అసమర్థతపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంతర్గత విభేదాలు కూడా ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని, ఇది పార్టీలో అసమ్మతికి దారితీస్తోందని వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు 4.0 పరిపాలన భారీ అంచనాలతో ప్రారంభమైనప్పటికీ, అమలు, పారదర్శకత, సమన్వయ లోపాలతో సతమతమవుతోంది. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల్లో పురోగతి లేకపోవడం, సూపర్ సిక్స్ హామీల అమలులో జాప్యం, అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.







