ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా బ్యాలెట్ల పంపిణీ ఏప్రిల్ 30లోగా పూర్తయ్యేలా చూస్తున్నాం...ఐనంపూడి కనకంబాబు

తానా బ్యాలెట్ల పంపిణీ ఏప్రిల్ 30లోగా పూర్తయ్యేలా చూస్తున్నాం...ఐనంపూడి కనకంబాబు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల నిర్వహణపై వచ్చిన వివిధ వార్తలపై క్లారిటీని ఇస్తూ తానా ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు స్పష్టత ఇస్తూ తానా బ్యాలెట్ల పంపిణీని ఏప్రిల్‍ 30 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తానా సభ్యుల చిరునామాల్లో ఏర్పడిన సాంకేతిక లోపాల కారణంగా పోస్టల్‍ బ్యాలెట్ల పంపిణీ ఆలస్యమైందని వీటిని నివారించి ఏప్రిల్‍ 30లోగా బ్యాలెట్ల పంపిణీని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం జరిగిన బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయించినట్లు చెప్పారు. బ్యాలెట్ల ముద్రణ, పంపిణీని సియాటెల్‍కు చెందిన ఎలక్షన్‍ ట్రస్ట్ సంస్థ నిర్వహిస్తోందని తమ కమిటీ సియాటెల్‍కు వెళ్ళి     బ్యాలెట్లు ముద్రణ, తపాలా పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల పక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు బోర్డు నిర్దేశంలో తాము నిబద్ధతగా ప్రయత్నిస్తున్నట్లు కనకంబాబు పేర్కొన్నారు.

తానా సభ్యుల పట్టికలో స్వల్ప సంఖ్యలో(30-40) నూతన ఓట్లు గుర్తించామని, ఈ అంశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే నేషనల్‍ ఛేంజ్‍ ఆఫ్‍ అడ్రస్‍తో తానా సభ్యుల పట్టిక సరిచూసే క్రమంలో ప్రాంతీయ ఆధారిత విభజనలో   లోపాలు ఉండటం చూసి దానిని సరిదిద్దేందుకు సమయం తీసుకున్నామని, అందుకే బ్యాలెట్ల పంపిణీ ఆలస్యమైందని చెప్పారు. ఎలాంటి మార్పులకు లోను కాని ఏప్రిల్‍ 5న తొలిసారిగా ఎన్నికల కమిటీకి అందిన పట్టికనే సియాటెల్‍ సంస్థ ఎలక్షన్‍ ట్రస్ట్ చేత వినియోగించవల్సిందిగా బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు ఓటర్ల లిస్ట్ విషయంలో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేసేందుకు బోర్డ్ ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డా.జంపాల చౌదరి, డా. బండ్ల హనుమయ్య, వెన్నం మురళీలతో కూడిన ఓ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు బోర్డ్ చైర్మన్‍ హరీష్‍ కోయ తెలిపారు.

 

Tags :