Radha Spaces ASBL

అంగరంగ వైభవంగా వాటా శుభకృత్ ఉగాది వేడుకలు

అంగరంగ వైభవంగా వాటా శుభకృత్ ఉగాది వేడుకలు

వాషింగ్టన్‌ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 9 శనివారం సాయంత్రం నిర్వహించిన శుభకృత్‌ నామ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా ఎవెరెట్‌ లోని సివిక్‌ ఆడిటోరియంలో జరిగాయి. ఇండియా నుంచి విచ్చేసిన తారలు మరియు వాషింగ్టన్‌ నలుమూలల నుండి 1400 మందికి పైగా ప్రేక్షకులు ఈ వేడుకలకు తరలివచ్చారు. నూతనంగా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ అబ్బూరి నాయకత్వంలో కార్య నిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి వినూత్నంగా రూపొందించిన ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు ఆరు గంటలపాటు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగింది. 200మందికి పైగా చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక, చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, పాడిన గీతాలు అందరినీ అలరించి ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నాయి.

వాషింగ్టన్‌ లో బోతెల్‌ వున్న తెలుగు పూజారి శ్రీ వాసుదేవ శర్మ  ఉగాది పంచాంగ శ్రవణం మరియు ఈ కొత్త సంవత్సర రాశి ఫలాలను అందరికీ విశదీకరించారు. వాషింగ్టన్‌ నలుమూలలు నుండి వచ్చిన చిన్నారుల అద్భుత ప్రదర్శనలతో ఆధ్యాంతం ఆకట్టుకున్నారు. ఆర్కెస్ట్రాతో స్థానిక బృందం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఇండియా నుండి విచ్చేసిన సినీ తారలు అదితి గౌతమ్‌ మరియు పూజ రaవేరి డాన్సులతో వేదిక ప్రాంగణం హోరు మన్నది. ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ అబ్బూరి సినీ తారలతో వేదిక మీదకు వచ్చి డాన్సులు చెయ్యడంతో స్టేజి ఈలలు చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ ఉగాది ఉత్సవాలలో ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాపేశ్వరం కాజా లాంటి పాతిక తెలుగు సాంప్రదాయ వంటకాలతోపాటు షడ్రుచుల ఉగాది పచ్చడి, అరిటాకు సహపంక్తి భోజనాలు వాషింగ్టన్‌ తెలుగు వారిని ఆకట్టుకున్నాయి.

ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ అబ్బూరి మరియు కార్యకర్తలు సాంప్రదాయ తెలుగు పంచెకట్టుతో అందరికీ కొసరి కొసరి వడ్డించి మన అసలు సిసలు తెలుగు సాంప్రదాయ ఆతిధ్యాన్ని చవి చూపించడంతో తెలుగు సభ్యులు తాము స్వదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్నామన్న విషయం మరచేలా చేసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వనితులకు మరియు ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్య వర్గానికి, వలంటీర్లకు ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ అబ్బూరి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి వినూత్నంగా స్పాన్సర్స్‌ కు మరియు ముఖ్యంగా తెలుగును ముందు తరాలకు తీసుకు వెళ్ళటం లో ముఖ్య భూమిక పోషిస్తున్న తెలుగు బడి అధ్యాపక బృందానికి శాలువాలతో సత్కరించారు.

 

Tags :