ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సిలో టిటిఎ మెగా కన్వెన్షన్... రాజకీయ ప్రముఖుల రాక

న్యూజెర్సిలో టిటిఎ మెగా కన్వెన్షన్... రాజకీయ ప్రముఖుల రాక

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా కన్వెన్షన్‌కోసం ఏర్పాటైన కమిటీలు తమకు కేటాయించిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నాయని, ఈ కన్వెన్షన్‌లో ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలతోపాటు బిజినెస్‌ సెమినార్‌లు, యూత్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, జబర్దస్త్‌, పొలిటికల్‌ ఫోరం, పాలసీ చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, టిటిఎ మాట్రిమోనియల్‌ ద్వారా వధూవరుల పరిచయ వేదికను కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలో మొదటిసారిగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఈ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ కన్వెన్షన్‌లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తోపాటు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట్‌ రెడ్డి, మాజీ ఎంపి మధు యాష్కీ గౌడ్‌, టిపిసిసి సెక్రటరీ, ఎఐసిసి సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, బిజెపి పార్లమెంట్‌ సభ్యుడు డి. అరవింద్‌, బిజెపి జాతీయ నాయకురాలు డి.కె. అరుణ, జి.వివేక్‌ తదితరులు హాజరవుతున్నారు. ఈ వేడుకకు రావాల్సిందిగా కేంద్రమంత్రి జి. కిషన్‌ రెడ్డిని కూడా టిటిఎ నాయకులు ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే. తారకరామారావును, ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌రావును, రాష్ట్ర పాడి, పశుపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా టీటిఎ నాయకులు ఆహ్వనించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపి సంతోష్‌ కుమార్‌ జోగినిపల్లి, కే. కేశవరావును, తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డిని కూడా టిటిఎ నాయకులు కన్వెన్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.

* న్యూజెర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో 27వ తేదీ రాత్రి బాంక్వెట్‌ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5.30 గంటల నుంచి రిజిస్ట్రేషన్‌, కాక్‌టైల్‌ అవర్‌, 7.15 గంటలకు స్వాగతోపన్యాసం వంటి కార్యక్రమాలు ఉంటాయి. నృత్యమాధవి స్కూల్‌కు చెందిన దివ్య ఏలూరు విద్యార్థుల గణేశ స్తుతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులను కూడా అందించిన తరువాత సినీ సెలబ్రిటీల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సినీ సంగీత దర్శకుడు కోటి బృందంచే మ్యూజికల్‌ నైట్‌ జరుగుతుంది. ఈ మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంలో ఉష తదితరులు పాటలు పాడనున్నారు.

* 28వ తేదీ ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్యం గీతం ప్రదర్శించనున్నారు. 

* తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగాకన్వెన్షన్‌ను పురస్కరించుకుని వడ్డేపల్లి కృష్ణ, జొన్నవిత్తుల రచించిన స్వాగత గీతానికి వందమాతరం శ్రీనివాస్‌ మ్యూజిక్‌ సమకూర్చారు. ముగ్గురు కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ స్వాగతగీతాన్ని దాదాపు 50 మందికిపైగా మహిళలు, చిన్నారులు పాడనున్నారు.

* తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగాకన్వెన్షన్‌లో హైలైట్‌గా తెలంగాణ కళా ప్రదర్శన రూపకం నిలవనున్నది. తెలంగాలోని ప్రముఖ కళలను ఇందులో ప్రదర్శించనున్నారు. లంబడా, గుస్సాడి, థింసా, పేరిణి, బుర్రకథలు ఇతర కళా రూపాలతో ఈ తెలంగాణ కళా ప్రదర్శన రూపకం తయారవుతోంది. 

* తెలంగాణ వైభవం పేరుతో మరో డ్యాన్స్‌ బ్యాలెట్‌ కూడా ఈ మెగా కన్వెన్షన్‌లో హైలైట్‌ కానున్నది.  తెలంగాణ కవులు, కళాకారులు, పుణ్య క్షేత్రాలు, తెలంగాణ స్వాతంత్య్రసమర యోధులతో ఈ డ్యాన్స్‌ బ్యాలెట్‌ను తయారు చేస్తున్నారు.  జొన్నవిత్తులగారు రాసిన ఈ రచనకు వందేమాతరం  శ్రీనివాస్‌ సంగీతం అందించారు. నలుగురు టీచర్లు దీనికి  కొరియోగ్రఫీ చేస్తున్నారు. 60,69 మంది డ్యాన్స్‌ బాలె చేస్తున్నారు.

* ఎస్‌పిబి, సిరివెన్నెల, ట్రిబ్యూట్‌ పేరుతో ఓ కార్యకమం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

* న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మరఫీ స్థానిక సెనేటర్‌ మేయర్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం సాయంత్రం ప్రముఖ సింగర్‌ సునీత బృందంచే సంగీత విభావరి జరుగుతుంది. రసమయి బాలకిషన్‌ బృందం ప్రదర్శనతోపాటు స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి. సినిమా నటీనటులు నిఖిల్‌ రితూ వర్మ అంజలి జబర్దస్త్‌ బృందం ప్రదర్శనలు కూడా హైలైట్‌గా నిలవనున్నాయి.

* జబర్దస్త్‌ టీమ్‌కు చెందిన కళాకారులు కూడా తమవంతుగా ఎన్నారైలను ఈ కన్వెన్షన్‌లో అలరించనున్నారు. జబర్దస్త్‌ కళాకారులు అభి, రాఘవ తమ కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకోనున్నారు. 

* మూడవరోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమెరికాలో తొలిసారిగా ఈ కళ్యాణాన్ని తమ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణోత్సవంకోసం యాదాద్రి నుంచి అర్చకులు ఇక్కడకు తీసుకువస్తున్నారు. ఆరోజు రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి జరుగుతుంది. ఈ మెగా కన్వెన్షన్‌లో హైలైట్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ లైవ్‌ సంగీత కచేరి నిలవనున్నది. రాక్‌స్టార్‌ తన సంగీతంతో కన్వెన్షన్‌కు వచ్చినవారిని ఆనంద పరచనున్నారు. రంజిత్‌, సాగర్‌, గీత, రీట, మౌనిమ తదితరులు ఈ లైవ్‌ సంగీత కార్యక్రమంలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకో నున్నారు. సింగర్‌ ఉష, సింగర్‌ సునీత, కాప్రిసియో బ్యాండ్‌ ద్వారా మ్యూజికల్‌ షో వంటి ఉల్లాసభరిత కార్యమ్రకమాలతోపాటు మహిళ లకు వివిధ రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలకు యాంకర్‌లుగా సుమ, రవి వ్యవహరిస్తున్నారు.

* కాన్ఫరెన్స్‌కు అనుబంధంగా వాణిజ్యం, ఐటీ, మహిళ, పొలిటికల్‌ సెమినార్‌, యువతకోసం ప్రత్యేక కార్యక్రమాలు, మ్యాట్రిమోనీ తదితర కార్యక్రమాలను కూడా ఈ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు. టిటి స్టార్‌ సింగర్‌ను కూడా ఈ వేడుకల్లో ప్రకటించనున్నారు. యువత కోసం క్రూయిజ్‌ పర్యటన ఏర్పాటు చేశారు.

* ఇమ్మిగ్రేషన్‌ ఫోరం సదస్సులో సంతోష్‌ ఆర్‌ సోమిరెడ్డి, జనేత కంచర్ల, భాను బి. ఇలింద పాల్గొంటున్నారు.

* టిటిఎ బిజినెస్‌ ఫోరంలో ప్రిన్సిపల్‌ స్పీకర్‌గా డా. ఎం.ఎస్‌. రెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ పాల్గొంటున్నారు.

* టిటిఎ జెఎన్‌టియు అలూమ్ని మీట్‌ కూడా కన్వెన్షన్‌లో జరుగుతుంది.

 

 

Tags :