Radha Spaces ASBL

వైద్యం, విద్య సేవలపై తానా ప్రాధాన్యం : అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు

వైద్యం, విద్య సేవలపై తానా ప్రాధాన్యం : అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు

పేదలకు అవసరమైన వైద్యం, విద్యకు సంబంధించిన సేవలపై తానా, తానా ఫౌండేషన్‌ ప్రత్యేక దృష్టి సారించి అందిస్తోందని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు అన్నారు. సింగరకొండ రహదారిలోని కూకట్ల కన్వెన్షన్‌ వద్ద ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు కంటి పరీక్షల శిబిరాలను చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల నిర్వహించారు. తానా ఫౌండేషన్‌ కూకట్ల ఫౌండేషన్‌ మరియు రోటరీ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత వైద్య పరీక్షలు అందించారు. ఈ సందర్భగా జరిగిన సభకు ఎన్నారై కూకట్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన అంజయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనంతపురం నుంచి ప్రారంభమైన చైతన్యస్రవంతి సేవా కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుతున్నామన్నారు. అంచనాలకు మించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను సుమారు 20 నుంచి 25 మంది తానా సభ్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. తాము ఉచితంగా అందించే  క్యానర్స్‌ పరీక్షలకు ప్రైవేట్‌ వైద్యకళాశాలలో కనిష్ఠం 20  వేలు ఖర్చు అవుతాయని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా ఉచితంగా స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధి సోకిన తర్వాత కంటే ముందుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నారు. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను కూడా ముందుగానే తెలుసుకోవచ్చని తెలిపారు. తన ఆధ్వర్యంలో జరిగే క్యాన్సర్‌ నిర్ధారణ, కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన  వైద్య శిబిరం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈ శిబిరంలో క్యాన్సర్‌ కు సంబంధించి వందమంది ఉచితంగా వైద్య పరీక్షలు పొందగా 150 మంది కంటీ పరీక్షలు చేయించుకున్నారు. కంటి సమస్యతో బాధపడుతున్న విద్యార్థులకు కళ్ళజోళ్ళను పంపిణీ  చేశారు.

ఎన్‌ఆర్‌ఐ కూకట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన ఫౌండేషన్‌ మరియు కూకట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైద్యం, విద్యకు ప్రాదాన్యత కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తిమ్మాపాలెం జడ్పీ పాఠశాల ఆవరణలో నూతనంగా ప్రారంభించిన జూనియర్‌ కళాశాలకు 30 సైకిళ్లతో సైకిల్‌ బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

 

Tags :