ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాన్సస్‌ సిటీలో బతుకమ్మ సంబరాలు

కాన్సస్‌ సిటీలో బతుకమ్మ సంబరాలు

కాన్సస్‌ సిటి తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (TAGKC) 15 వ వార్షికోత్సవ బతుకమ్మ పండుగ సంబరాలు అక్టోబర్‌ 10న ఘనంగా జరిగాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయానికి అనువుగా కొలనుకు ఆనుకొని ఉన్న హెరిటేజ్‌ పార్కులో స్వచ్ఛమైన వాతావరణంలో జరుపుకున్నారు.

బోర్డు చైర్మన్‌ కిరణ్‌ కనకదండిల, అధ్యక్షురాలు శ్రీదేవి గొబ్బూరి ఆధ్వర్యంలో, వారి కార్యవర్గ సభ్యులు గౌరి చెరుకుమూడి, సూర్య జగడం, విజయ్‌ కొండి, సందీప్‌ మందుల, సరిత మద్దూరు, సుష్మ రెడ్డి, సరళ కొత్త, జయ కనకదండిల, రాజ్‌ చీడెల్ల, వెంకట్‌ పుసులూరి, ఉమ మధిర, మరియు ఇతర వాలంటీర్ల సమిష్టి కృషితో జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పాల్గొన్నారు.
ప్రోగ్రామ్‌ ప్రారంభం కావడానికి ముందు, విచ్ఛేసిన అతిథులకు పాలకూర బజ్జి, పకోడీలు అందించారు. పురుషులు జమ్మి ఆకు (‘‘బంగారం’’) పంచుకొని అలై బలై చేసుకొన్నారు. వేడి టీ ఆస్వాదిస్తూ, చల్లగా వీస్తున్న గాలికి అందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉండె. దారి పొడుగునా ఉన్న చెట్ల చుట్టూచుట్టిన బంతి పూల మాలలతో, పందిరి కింద పూదొంతరల శిఖరాగ్రాన కొలువున్న3 అడుగుల అమ్మవారి విగ్రహం చుట్టూ, గునిగిపూల సోయగాలు.. తంగేడు రెపరెపలు.. ఉప్పుపూల పులకరింతలు.. మందార మకరందాలు.. బంతి సింగారాలతో ఇండ్లలో పేర్చి ముస్తాబు చేసిన బతుకమ్మలను చేతులలో పట్టుకొని , చిన్నా పెద్దా ఆడబిడ్డలు అందమైన దుస్తులలో, ఆభరణాల అలంకరణలతో, గుమిగూడుతూ వచ్చి గౌరి దేవికి ఆరాధనతో లలితా సహస్ర నామాలతో పూజ ప్రారంభించారు.

ప్రముఖ ఆల్‌ ఇండియా రేడియో జనపద కళాకారుడు జనార్ధన్‌ పన్నెల గారి సాంప్రదాయమైన బతుకమ్మ పాటలు ఈ కార్యక్రమానికి పెద్ద ఆకర్షణ. రామ రామ రామ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ, అంటూ ఎన్నెన్నో జానపద గీతాలను పాడుతూ, జనార్దన్‌ కొన్ని పాటలకు వాటి అర్ధం సరళమైన భాషలో చెప్పి ప్రతీ ఒక్కరికి ప్రకృతి పట్ల కూడా మంచి అవగాహన కల్పించారు. అంతేకాక అప్పుడప్పుడు తాను కూడా ఆడుతూ, పాఠశాల మరియు కళాశాల పిల్లల తో పాటు, పురుషులను కూడా కోలాటానికి ప్రోత్సహించి మరింతగా కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సూర్యాస్తమయంకు బతుకమ్మలను సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ తెలంగాణ డప్పు సంగీత వాయిద్యంతో అడపఢుచులు తలపైన ఊరేగింపుగా పక్కనే ఉన్న చెరువుకు తీసుకొని వెళ్లగా ముగ్గురు పురుషులు మోకాలు లోతు లో నిలబడి బతుకమ్మలను నిమజ్జనం చేసి ఖాళీ తాంబాళాలను ఇస్తూ సహాయం చేశారు. భోజనం శుచిగా అదే ఉద్యానవనంలో కొన్ని గంటల ముందే వండడం మరొక విశిష్టత. శ్రీదేవి పేరు పేరున ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరగటానికి సహకరించిన స్పాన్సర్స్‌కు, కార్యవర్గ సభ్యులకు, ఎన్నో సహయ సహకారాలు అందించిన వలంటీర్స్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

ఆరు గంటల పాటు సౌండ్‌ సిస్టం సహకారం అందించిన సహన్‌ పుసులూరి కి, విశ్వమొహన్‌ అమ్ములకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని అందరికి తెలిపేలా బతుకమ్మ పండుగ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు పెద్దలు వారి సంతోషాన్నివ్యక్త పరిచారు. చివరగా వందన సమర్పణతో ఈ కార్యక్రమానికి హాజరైన అందరు ఆడబిడ్డలకు తామర ఆకారంలో ఉన్న రాగి ప్రమిదలను ఇచ్చి శ్రీదేవి ఈ వేడుకలను ముగించారు.

 

Tags :