Radha Spaces ASBL

TAGB ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు

TAGB ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు

12 అక్టోబర్ 2019 న Chelmsford Highschool లో Telugu Association of Greater Boston (TAGB) దసరా, దీపావళి వేడుకలకు 900 లకు పైగా సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఎప్పటి లాగే పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం చేయటానికి, TAGB కార్యవర్గ సభ్యులు, ప్రేక్షకులకి ఎన్నో చక్కని ఆహ్లాదకరమైన కార్యక్రమాలను అందించి అలరించారు. కార్యక్రమ ప్రాంగణాన్నిTAGB శ్రీమతి రూబి బోయినపల్లి ఆధ్వర్యంలో అలంకరణ బృందం, సంప్రదాయ బద్ధంగా దసరా దీపావళి సంబంధించిన ఉత్సవ ప్రత్యేక అలంకరణతో పాఠశాల ప్రవేశద్వారం మరియు వేదికను అలంకరించి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు.

నాటి వేడుకలు Executive Committee members జ్యోతి ప్రజ్వలన చేసిన పిదప ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యాయి. చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక గానామృతములతో, భజనలు, డాన్సు మెడ్లీల సందడులతో, శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్శనల తో, పాటు పెద్దలు ఉత్సాహంగా చేసిన Dance TAGB Dance కార్యక్రమాలు ప్రేక్షకుల ప్రత్యేకప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వక్తృత్వ పోటీలలో చిన్నారులు పాల్గొని చక్కని తేనే పలుకులతో ప్రసంగించి ఎంతో మనోహ్లాదం కలిగించారు. శ్రీ కృష్ణదేవరాయలు - తెనాలి రామలింగడు కథతో 'చిట్టి పిల్లలు - గట్టి పలుకులు' అనే అందమైన నాటికను చక్కని తెలుగు పద్యాలతో, మాటలతో, మనబడి పాఠశాల విద్యార్థులు  వేదిక పై ప్రదర్శించారు.

వీణ విద్వంసులు శ్రీ వడాలి ఫణి నారాయణ గారు, తన వీణా వాద్యంతో కార్యక్రమంలో దీపావళి టపాసులాగా ధమాకా మోగించారు. సినీ, fusion మ్యూజిక్ తో, మంచి మంచి పాటలని మనస్సుకి హత్తుకునేలాగా, వీనుల విందుగా తన వీణ పై వాయించి అద్భుతమైన సంగీత ప్రపంచంలో ఓలలాడించారు ఫణి గారు. ప్రేక్షకులు అత్యంతానందంతో వారిని చప్పట్ల వర్షంలో ముంచెత్తారు.

శ్రీ అరుణ్ మూల్పూర్ గారి దర్శకత్వంలో మరియు సుధా  మూల్పూర్ నేపథ్యంలో ప్రదర్శించిన మాయాబజార్ నాటకం ప్రేక్షకులని మరొక్కసారి flashback లోకి తీసుకెళ్లి, మొత్తం దసరా కార్యక్రమానికే కలికితురాయిలా నిలిచింది. సినిమా  మొదట 1957 లో వచ్చినా, ఈ నాటికీ అది తెలుగు వారి మనసులో ఎంత నిలిచి పోయింది అనేది ఈ కార్యక్రమానికి ప్రేక్షకులనించి వచ్చిన ప్రోత్సాహంతోనే తెలిసిపోయింది. SV రంగారావు గారిని తలపించేలా ఘటోత్కచునిగా శ్రీ అరుణ్ మూల్పూర్ ప్రదర్శించిన నటన ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంది. ఆ నాటి సినిమాలోని పాటలు (అహ నా పెళ్లి అంట, వివాహ భోజనంబు, లాహిరి లాహిరి లో, సుందరి నీవంటి, నీవేనా నను తలచినదీ), నృత్యాలు, సరదా కబుర్లు, కామెడీ సన్నివేశాలు ఇవన్నీ నాటకంలో పాత్రధారులు జీవించి పోషించారు. 50 మందికి పైగా cast and crew తో నాటకం విజయవంతం గా ప్రదర్శించారు.

కల్చరల్ సెక్రటరీ  శ్రీమతి సుధా  మూల్పూర్ పర్యవేక్షణలో కల్చరల్ టీమ్ రెండు నెలలకు పైగా కష్టపడి, దీపావళి కార్యక్రమాన్ని అందించారు. 7 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 30 కి పైగా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు. కార్య వర్గ సభ్యులు శ్రీ సీతారాం అమరవాది, శ్రీ రమణ దుగ్గరాజు, శ్రీ రామకృష్ణ పెనుమర్తి, పద్మజ బాల, శ్రీ రమేష్ దడిగాల మరియు  శ్రీ వెంకట్ పప్పల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి అంటే వాటి వెనుక ఎందరో స్వచ్ఛందసేవకులు మరియు TAGB కమిటీ సభ్యుల ఎన్నో గంటల నిర్విరామ పరిశ్రమ ఫలితమే. Sraveo బృందం వారు Audio/Visual సహకారం అందించారు.

నాటి సాయంత్రము ప్రదర్శనలతో పాటు ఆవరణ లో పెట్టిన అంగడులు కూడావచ్చినవారిని ఆకట్టుకున్నాయి. ఆ నాటి సాయంత్రము మయూరి రెస్టారెంటు వారు, విచ్చేసిన ఆహుతులకు చక్కని రుచికరమైన భోజనం అందించారు.

చివరిగా ఎంతో కృషిని, సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతంచేసిన ప్రదర్సకులకు,  ప్రేక్షకులకు, వాలంటీర్లకు, TAGB కార్యవర్గ సభ్యులకు, మరియు దాతలకు సెక్రటరీ పద్మజ బాల ధన్యవాదాలు తెలియజేసారు. అమెరికా, భారత జాతీయ గీతం పాడటంతో నాటి వేడుకలు విజయవంతంగా ముగిసాయి.

Click here for Event Gallery

 

Tags :