Radha Spaces ASBL

బాటా స్వర్ణోత్సవ వేడుకల్లో దిగ్విజయంగా జరిగిన "సాహితీ బాట" కార్యక్రమం

బాటా స్వర్ణోత్సవ వేడుకల్లో దిగ్విజయంగా జరిగిన "సాహితీ బాట" కార్యక్రమం

బాటా (బే ఏరియా తెలుగు అసోసియేషన్) స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అక్టోబరు 22, 2022 శనివారం రోజున శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన "సాహితీ బాట" కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ప్రముఖ సాహితీవేత్తలు డా.కె.గీతామాధవి కన్వీనర్ గా, శ్రీ కిరణ్ ప్రభ ఆనరరీ ఎడ్వైజర్ గా జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి, ప్రముఖ వైద్యులు లక్కిరెడ్డి హనిమిరెడ్డిగారు ప్రారంభించారు.  గత యాభై ఏళ్లుగా బాటా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు వారి సంస్కృతి, భాష, సాహిత్యాలకు విశేషంగా తోడ్పడుతూ ఉందని కొనియాడారు. ఉదయం 10 గం.కు శ్రీ మధు ప్రఖ్యా అధ్యక్షతన ప్రారంభమైన కవిసమ్మేళనంలో శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ శ్యామ్ సుందర్ పుల్లెల, శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, శ్రీమతి అపర్ణ గునుపూడి, డా.కె. గీతామాధవి, శ్రీమతి భవాని ముప్పల, శ్రీమతి షంషాద్ మహమ్మద్,  శ్రీమతి శారద కాశీవఝల, శ్రీ పాలడుగు శ్రీచరణ్, శ్రీమతి సుమలత మాజేటి, శ్రీ కే.వి. రమణారావు, శ్రీమతి స్వాతి ఆచంట, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, శ్రీ శశి ఇంగువ, శ్రీ వరకూరు గంగాధర ప్రసాద్, శ్రీ సాయికృష్ణ మైలవరపు పాల్గొని తమ కవితాగానంతో అందరినీ అలరించారు.

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు సాహితీ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

తరువాత జరిగిన డా.మేడసాని మోహన్ గారి అష్టావధానంలో  శ్రీ పాలడుగు శ్రీచరణ్ సంచాలకత్వం వహించగా, డా.కె.గీతామాధవి- దత్తపది, శ్రీ రావు తల్లాప్రగడ - నిషిద్ధాక్షరి, శ్రీ శ్యామ్ సుందర్ పుల్లెల - సమస్య, శ్రీమతి సుమలత మాజేటి - న్యస్తాక్షరి, శ్రీ మధు ప్రఖ్యా - అప్రస్తుతము, శ్రీమతి స్వాతి ఆచంట - ఆశువు, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి - వర్ణన, శ్రీ మారేపల్లి నాగ వేంకటశాస్త్రి - పురాణపఠనము కావించి పృచ్ఛకత్వం వహించారు.

చివరగా శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతలో జరిగిన కథాచర్చలో శ్రీ శ్రీధర, శ్రీ కే.వి. రమణారావు, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీమతి సుమలత మాజేటి, శ్రీమతి షంషాద్ మహమ్మద్,  శ్రీమతి జయ తాటిపాముల మున్నగువారు పాల్గొని మంచి కథ రాయడం ఎలా? అనే అంశంలో వస్తువు, శిల్పం, కథాగమనం, ఎత్తుగడ, ముగింపు, పాత్రలు, నేపథ్యం, భాష, సంభాషణలు, దృష్టికోణం, శైలి - స్వరం, వర్ణనలు, క్లుప్తత, కథా ప్రయోజనం మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిపారు.

సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ సాహితీ బాట కార్యక్రమంలో స్థానికులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

 

Click here for Photogallery

 

 

Tags :