ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవంపై చిరంజీవి వీడియో సందేశం

తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవంపై చిరంజీవి వీడియో సందేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జూలై 24 నుండి 26 వరకు మూడు రోజులపాటు ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని’ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆన్‍లైన్‍లో జరిగే ఈ ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ మెగాస్టార్‍ చిరంజీవి ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు.

తెలుగు భాష తెలుగు సంప్రదాయ సంస్కృతీ పరిరక్షణ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి జూలై 24 నుంచి 26వ తేదీ వరకు ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించడం సంతోషకరమని చిరంజీవి పేర్కొంటూ, ప్రాచీన హోదాను దక్కించుకున్న తెలుగు భాష సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి భాషా సాంస్కృతిక సంప్రదాయ సమ్మేళనాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ... తెలుగు భాష - తెలుగు సంస్కృతి సంప్రదాయ ఔన్నత్యం పట్ల మీరు చూపుతున్న చెక్కుచెదరని మీ అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు 15వ స్థానంలో.. భారతదేశంలో చూసుకుంటే హిందీ బెంగాలీ తర్వాత మూడో స్థానంలోను.. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ గుజరాతీ తర్వాత మూడో స్థానంలో వెలుగొందుతోంది మన తెలుగు’’ అని కొనియాడారు.

స్వదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని.. ప్రపంచంలో ఇటాలియన్‍ ఆఫ్‍ ది ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్న భాష తెలుగు. ఈ కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు సంప్రదాయ విలువలు ముందు తరాల వారికి అందించేందుకు మీరు చేస్తున్న కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ మూడు రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని చిరంజీవి మాట్లాడారు.

Tags :