Radha Spaces ASBL

తానా భూమి భారతి ప్రారంభం

తానా భూమి భారతి ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ కలిసి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని అత్తోటలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తానా బృందంతో కలిసి భూమిభారతి విత్తన కేంద్రాన్ని ఆయన ఇటీవల ప్రారంభించారు. అంతకుముందు తమ గ్రామానికి వచ్చిన తానా బృందం సభ్యులతో పాటు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరికి మేళతాళాలు, పూర్ణకుంభంతో గ్రామస్తులు  ఘన స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. అనంతరం విత్తన కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చిరుధాన్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఐశ్వర్యం కంటే ఆరోగ్యం గొప్పదన్న విషయం ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ అర్థమైందన్నారు. మన ప్రాంతంలో రసాయన రహితంగా పండిరచిన  ఉత్పత్తులకు అమెరికా మార్కెటింగ్‌పై అధ్యయనం చేసి మన రైతులకు మేలు జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. అందరమూ రైతు బిడ్డల మేనని, తమ తల్లితండ్రులు కష్టపడి మమ్మల్ని చదివిస్తే ఈ స్థాయికి చేరామన్నారు. జన్మభూమి రుణం తీర్చుకునే క్రమంలో తానా చైతన్య స్రవంతి ద్వారా సహకారం అందించిన ఈ భూమి భారతి తమకు ఒక మైలు రాయిగా మిగిలి పోతుందని, ఇది తానా పర్ణశాలగా ఆయన అభివర్ణించారు. 

జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని ఎప్పుడూ మరవకూడదన్నారు. నిరంతరం కష్టానే నమ్ముకుని సేద్యం చేస్తున్న రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం కోసం తానా బృందం కృషి చేస్తున్నట్టు తెలిపారు.  రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.  రైతులు సేంద్రియ వ్యవసాయం విధానంలో పంటలు పండిస్తే నాణ్యమైన ఉత్పత్తులను దేశానికి అందించవచ్చన్నారు. వ్యవసాయంలో నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని రైతులు వాటిని వినియోగించుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ ప్రాంతంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు యంత్ర పరికరాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో నూతన మార్పులు వచ్చాయని, రానున్న రోజుల్లో మరింత మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నారు. ప్రకృతి వ్వయసాయం ద్వారా పంటలు పండిస్తే మార్కెట్‌లో ఆ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంటుందని అంజయ్య చౌదరి స్పష్టం చేశారు.

దేశంలోనే నమూనాగా నిలిచే ఈ ప్రయత్నానికి తమ వంతు సహాకారం అందిస్తామని తానా ప్రతినిధులు హామీ ఇచ్చారు.  ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీయ విత్తనాలు అందించటం, వాటి ద్వారా పండిన పంటకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించటం గో ఆధారిత సాగు లక్ష్యంగా భూమి భారతి కృషి చేస్తుందని నిర్వాహకులు బాపారావు అక్బర్‌ తెలిపారు. తానా ఫౌండేషన్‌, జేడీ ఫౌండేషన్‌ అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకృతి సాగును మరింతగా విస్తరిస్తామని వారు వివరించారు.  

ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, తానా స్త్రీ శక్తి భవన్‌ వ్యవస్థాపకుడు రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి సమన్వయకర్త పంట్ర సునీల్‌, తానా ఫౌండేషన్‌ సెక్రటరీ వల్లిపల్లి శశికాంత్‌, రైతు నేస్తం ఫౌండేషన్‌ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, జేడీ ఫౌండేషన్‌ జేడీ లక్ష్మీనారాయణ, ఉప్పుటూరి సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.  

 

 

Tags :