ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా సేవలు అభినందనీయం - సబితా ఇంద్రారెడ్డి

ఆటా సేవలు అభినందనీయం - సబితా ఇంద్రారెడ్డి

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో మాతృరాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆటా వేడుకల్లో భాగంగా చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆటా నిర్వహించిన  వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటా సంఘం అధ్యర్యంలో పాఠశాలలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. 30 సంవత్సరాలుగా ఆటా ప్రతినిధులు నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమన్నారు. తాము పుట్టిన దేశానికి, ఊరికి, పాఠశాలలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న ఆటా సభ్యులను మంత్రి అభినందించారు.

పాఠశాలలో వాటర్‌ప్లాంట్‌, కేజీబీవీకి పేరేడ్‌ డ్రమ్ములు, నిరుద్యోగులకు జాబ్‌మేళా, విద్యార్థులకు డిక్షనరీలు, ప్లేట్లు, దుప్పట్లు అందజేయడం గొప్ప విషయమన్నారు. ఆటా ప్రతినిధి భువనేశ్‌ బోజాల మాట్లాడుతూ అమెరికాలో చదువుకుంటున్న, స్థిరపడిన తెలుగువారికి ఆటా అండగా ఉంటుందని తెలిపారు. 30 సంవ్సరాల క్రితం ఆటాను స్థాపించామని, ప్రతి రెండునెలలకోసారి సమావేశాన్ని నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. మాతృభూమికి సేవ చేయాలని ఉద్దేశతో ఆటా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యాక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ సిటీలో వచ్చే ఏడాది జులైలో ఆటా మహాసభలు నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమంలో పాల్గొన్నాలని  మంత్రితోపాటు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను ఆటా ప్రతినిధులు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆటా -2019 వేడుకలకు రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డిని ప్లాటీనం స్పాన్సర్‌గా నియమించినట్లు చెప్పారు.

 

Tags :