Radha Spaces ASBL

ఓవైపు కరోనాపై చర్యలు...మరోవైపు పథకాలు ప్రారంభం

ఓవైపు కరోనాపై చర్యలు...మరోవైపు పథకాలు ప్రారంభం

పాలనతో సత్తా చాటుతున్న జగన్మోహన్‍ రెడ్డి

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్మోహన్‍ రెడ్డి కరోనా సంక్షోభ సమయంలో కూడా తనదైన శైలిలో పాలనను నడిపిస్తున్నారు. ఓవైపు దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్‍ టెస్టులు చేస్తూనే పాజిటివ్‍ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నా భయపడాల్సిన పనిలేదని ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ భరోసానిస్తున్నారు. ఈ వైరస్‍ను ఎదుర్కోవడానికి గట్టి చర్యలు తీసుకున్నామని, అతిగా భయపడరాదని, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మహామ్మారి బారిన పడకుండా ఉండొచ్చని ధైర్యం చెబుతున్నారు.  కరోనా వ్యాధి సోకితే అంటరానితనంగా భావించొద్దని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుందని అంటూ, కరోనా ఉన్నట్లుగా కూడా 81 శాతం మందికి తెలియనే తెలియదని, ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వ్యాపిస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, మరోవైపు కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రజలకు చేయూత ఇవ్వడంలో వెనుకంజ వేయడం లేదని, పేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని పేర్కొంటున్నారు.

కరోనా వ్యాధిని నివారించేందుకు మొదటి సారి మార్చి 25వ తేదీన లాక్‍డౌన్‍ ప్రకటించి ఇప్పటికి నెల రోజులు గడిచిపోయాయి. మనం ఎన్నో అడుగులు ముందుకు వేశాం. ఎప్పుడూ లేని విధంగా వైరస్‍ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని బాగా పెంచుకోగలిగామని అంటూ, గతంలో ఇలాంటి వైరస్‍ ఏదైనా వస్తే కనీసం పరీక్షలు నిర్వహించే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో లేదని ఆ పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్రంలో 9 ల్యాబ్‍లతో టెస్టింగ్‍లు జరిపే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చిందని అంటూ, వీఆర్‍డీఎల్‍ ల్యాబ్స్, దాదాపు 49 ట్రూనాట్‍ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేశామని, ఒకటీ రెండు టెస్టులు చేయాలంటే రెండు రోజులు పట్టే పరిస్థితి నుంచి ఈనెల రోజుల్లో ఒక్క రోజులోనే 6,517 టెస్టులు చేసే స్థాయికి దేవుడి దయ వల్ల చేరుకోగలిగామన్నారు.

అలాగే ఎక్కడ  రెడ్‍జోన్లు ఉన్నాయి? ఆరెంజ్‍ జోన్లు ఉన్నాయి? ఎక్కడ గ్రీన్‍జోన్లు? అనే దానిపై మనం స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, ఒక ప్రాంతంలో 4 పాజిటివ్‍ కేసులు నమోదైతే రెడ్‍ జోన్లుగా.. 1 నుంచి 4 మధ్యలో కేసులుంటే ఆరెంజ్‍ జోన్లుగా, కేసులు నమోదు కాని ప్రాంతాలను గ్రీన్‍ జోన్లుగా ప్రకటించామని తెలిపారు. రాష్ట్రంలోని 676 మండలాల్లో 63 మండలాలు మాత్రమే రెడ్‍జోన్‍లో ఉన్నాయి. 54 మండలాలు ఆరెంజ్‍ జోన్‍లో ఉన్నాయి. ఒక్క కేసు కూడా నమోదు కాని మిగిలిన 559 మండలాలు గ్రీన్‍ జోన్‍లో ఉన్నాయి. అంటే దాదాపు 80 శాతం మండలాల్లో కేసులు లేనందున అక్కడ సురక్షితంగా ఉన్నట్లేనని చెప్పారు. 

కరోనా వైరస్‍ చికిత్సకోసం విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో కోవిడ్‍ క్రిటికల్‍ కేర్‍ కేంద్రాలను, ప్రతి జిల్లాలో కూడా ఒక కోవిడ్‍ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని, అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా క్వారంటైన్‍ సౌకర్యాలు కల్పించామని, వచ్చిన వారిని బాగా చూసుకోవడమేకాక మంచి ఆహారం పెట్టి, వైద్యం చేసి పంపిస్తున్నామన్నారు.

వ్యక్తిగత భద్రత ఉప కరణాలు (పీపీఈ కిట్లు) కానీ, ఎన్‍-95 మాస్కులు కానీ ఇంతకు ముందు దొరికేవి కావు. ఈ నెలరోజుల్లో సమ•ద్ధిగా ప్రతి ఆస్పత్రిలో ఏర్పాటు చేశాము. ఎక్కడైనా అనుమానిత కేసు వస్తే, వారిని వెనక్కు పంపించకుండా, వారికి వైద్యం అందిస్తూ, అదే సమయంలో మిగిలిన రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుని,టెస్టులు చేసి.. పాజిటివ్‍గా ఉందని తేలితే వారిని కోవిడ్‍ ఆస్పత్రులకు పంపించడానికి అన్ని రకాలుగా సన్నద్ధం చేశాము. మరోవైపు 104కు ఎవరైనా ఫోన్‍ చేసి కరోనాకు సంబంధించిన లక్షణాలు కనిపించాయని చెబితే, వారిని పరీక్షలకు తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. ప్రత్యేకంగా 14410 నంబర్‍తో టెలి మెడిసిన్‍ కాల్‍ సెంటర్‍ కూడా ఏర్పాటు చేశాం. ఈ కాల్‍ సెంటర్‍ ద్వారా నాన్‍ కరోనా కేసులకు కూడా వైద్యం అందించామని జగన్‍ చెప్పారు. ఫోన్‍ చేసిన వారికి పిస్క్రిప్షన్‍ ఇవ్వడమే కాకుండా మందులు కూడా డోర్‍ డెలివరీ చేసే విధంగా వ్యవస్థలను సిద్ధం చేశామని అంటూ కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలను తీసుకుంటోందని తెలిపారు.

రికార్డు స్థాయిలో పరీక్షలు

రాష్ట్రంలో కరోనా వైరస్‍ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి ఆదేశాల మేరకు ప్రధానంగా రెడ్‍జోన్లు, కంటైన్‍మెంట్‍ జోన్లలో పరీక్షలపై ద•ష్టి సారించిన అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,334 మందికి పరీక్షలు నిర్వహించామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,504 చొప్పున పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధిక సగటుతో పరీక్షలు నిర్వహిస్తూ ఆంధప్రదేశ్‍ ప్రథమ స్థానంలో ఉందని వారు వెల్లడించారు. దేశంలో కరోనా పాజిటివ్‍ కేసుల సగటు 4.13 శాతం కాగా ఏపీలో చాలా తక్కువగా 1.57 శాతం మాత్రమే. మరణాల రేటు దేశంలో 3.19 శాతం కాగా ఏపీలో 2.46 శాతం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులన్నీ కంటైన్‍మెంట్‍ జోన్లనుంచే వస్తున్నాయన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ల్యాబ్‍లు సిద్ధం అవుతుండగా విజయనగరం, పశ్చిమ గోదావరిలో వీటి ఏర్పాటుపై దృష్టి సారించారు.

 

మరోవైపు పథకాల ప్రారంభం

కరోనా వైరస్‍పై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే మరోవైపు ప్రజలకు అవసరమైన పథకాలను ప్రారంభించడంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‍ రెడ్డి చొరవ చూపుతున్నారు.  విద్యాదీవెన, సున్నా వడ్డీ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

విద్యాదీవెన

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్ చేసే పథకం ఇది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్మోహన్‍ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదవారు అప్పులపాలు కాకూడదు. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది ఒక్క చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి వైయస్‍ జగన్‍ మోహన్‍రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‍ జగన్‍మోహన్‍రెడ్డి ప్రారంభించారు.

పేద విద్యార్థుల తలరాతలు మారాలి:

ప్రతి ఒకరు చదువుకోవాలి.. పేద విద్యార్థులందరి తలరాతలు మారాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు సీఎం జగన్‍. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్‍ కోసం జగన్‍ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీవినీ ఎరుగని పథకాలను ప్రవేశ పెట్టారు. పేద విద్యార్థుల పాలిట వరాలు కురిపించారు.

 

ఒకేసారి రూ.4 వేల కోట్లు విడుదల

గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్‍ను చెల్లించడంతో పాటు, 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను టీడీపీ సర్కారు చెల్లించలేదు. ఆ బకాయిలను వైఎస్‍ జగన్‍ ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది. అలాగే, 2019-20 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్‍ను కూడా విడుదల చేసింది. ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.4వేల కోట్లు విడుదల చేసింది.

ఫీజు రీయింబర్స్మెంట్‍ కోసం ఒకేసారి ఇంత పెద్ద మొత్తం విడుదల చేయడం చరిత్రలో ఎన్నడూలేదు. విద్యార్థుల భవిష్యత్‍పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విద్యావేత్తలు కొనియాడుతున్నారు.  ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

2020-21లో నేరుగా తల్లుల ఖాతాల్లోకి..

ఇదిలా ఉంటే.. రానున్న విద్యా సంవత్సరం 2020-21లో ఫీజు రీయింబర్స్మెంట్‍ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు వేయనున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక వసతి దీవెన కింద ఏటా రూ.20వేల వరకు తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.

 

Tags :