కేరళంలో మళ్లీ ‘కాంగ్రెస్’.. 99 స్థానాల్లో యూడీఎఫ్ ప్రభంజనం..!
కేరళం (Keralam) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు మించి కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. దశాబ్దాలుగా కేరళంలో వస్తున్న ‘ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మార్పు’ సంప్రదాయం ఈసారి కూడా పునరావృతం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఈ అనూహ్య ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు.
అధికార ఎల్డీఎఫ్కు గట్టి ఎదురుదెబ్బ..
కమ్యూనిస్టుల కంచుకోటగా భావించే కేరళంలో (Keralam) ఈసారి వామపక్ష (LDF) ప్రభుత్వానికి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ యూడీఎఫ్ ఏకంగా 99 స్థానాల్లో భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 71 మ్యాజిక్ ఫిగర్‌ను చాలా తేలికగా అధిగమించింది. మరోవైపు అధికార ఎల్డీఎఫ్ కూటమి కేవలం 40 స్థానాలకే పరిమితమై కుదేలైంది. ఎన్డీయే (NDA) కూటమి కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి
సీఎం పినరయి విజయన్ వెనుకంజ!
ఈ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన ‘ధర్మదం’ (Dharmadam) లో వెనుకంజలో ఉండటం. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ ఆయనకు గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పినరయి విజయన్‌తో పాటు ఆయన (Keralam) క్యాబినెట్‌లోని పలువురు కీలక మంత్రులు కూడా వెనుకంజలో ఉండటం ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటుందని కమ్యూనిస్టు నేతలు ఊహించలేకపోయారు.
అంచనాలకు మించిన విజయం: శశి థరూర్
ఈ భారీ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. “మేము కచ్చితంగా గెలుస్తామని ముందు నుంచీ చెబుతున్నాం, కానీ తాజా ఫలితాలు మేము ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా వస్తున్నాయి. కేరళం (Keralam) ప్రజలు ఈ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి, స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.
సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌దే తుది నిర్ణయం!
యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయం కావడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై థరూర్ స్పందిస్తూ, పార్టీలో సీఎం పదవి చేపట్టడానికి సమర్థులైన, అనుభవజ్ఞులైన నేతలు చాలా మంది ఉన్నారన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత, అధికారిక ఫలితాలు వెలువడిన అనంతరం విజయం సాధించిన ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్టానం సమావేశమవుతుందని స్పష్టం చేశారు. (Keralam) ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ అద్భుత విజయంతో రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
ఇవి కూడా చదవండి








