బిహార్లో మొట్టమొదటి బీజేపీ సీఎంగా సమ్రాట్ చౌధరీ
Samrat Choudhary: బిహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. భాజపా శాసనసభాపక్ష నేతగా సమ్రాట్ చౌధరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీతీశ్ కుమార్ రాజీనామా చేసిన నేపథ్యంలో, బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పరిణామంతో బిహార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న మొట్టమొదటి బిజెపి నేతగా ఆయన నిలువనున్నారు.
రాజకీయ ప్రస్థానం:
1990లో ఆర్జేడీ (RJD) పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన సమ్రాట్ చౌధరీ, ఆ తర్వాత జేడీయూ (JDU)లో చేరారు. కొన్నేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన, తన పనితీరుతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయనపై పార్టీ అధిష్టానం పూర్తి నమ్మకాన్ని ఉంచింది.
సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం:
బిహార్లో యాదవుల తర్వాత అత్యంత బలమైన వర్గంగా ఉన్న కుష్వాహా సామాజిక వర్గానికి సమ్రాట్ చౌధరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ సామాజిక వర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదు. గత ఎన్నికల ప్రచారంలో సమ్రాట్ చౌధరీని పెద్ద నాయకుడిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం, కీలకమైన సమయంలో ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.







