ఇద్దరు వైద్యునిపుణులకు.. ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

ఏషియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)కి చెందిన మరో ఇద్దరు వైద్యనిపుణులకు ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇన్‍టెస్టివల్ ఎండోస్కోపీ (ఏఎస్‍జీఈ) పురస్కారాలు వరించాయి. ఎండోస్కోపీలో అందించిన విశేష సేవలకుగాను ఏఐజీకే చెందిన సీనియర్ జీర్ణకోశ వ్యాధుల వైద్యనిపుణులు డాక్టర్ మనూ టాండన్‍కు అంతర్జాతీయ సేవా పురస్కారాన్ని, మరో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పార్థపాల్‍కు ఎండోస్కోపిక్ శిక్షణ పురస్కారాన్ని ఏఎస్‍జీఈ ప్రకటించింది. ఒకే సంవత్సరంలో ఒకే వైద్యసంస్థకు చెందిన ముగ్గురు జీర్ణకోశ వ్యాధుల నిపుణులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించడం అరుదైన విషయమని ఏజీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పురస్కారాలు తమ బాధ్యతలను మరింత పెంచాయని, వృత్తిపరంగా మరిన్ని సేవలందించేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చాయని డాక్టర్ మనూటాండన్, డాక్టర్ పార్థ తెలిపారు. ఎండోస్కోపీ విధానంలో ఆధునిక చికిత్సలను మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, ఈ పురస్కారాలను పొందడంలో ఏఐజీ అందించిన సహకారం మరువలేనిదని ఆ వైద్యనిపుణులు పేర్కొన్నారు. తాజాగా పురస్కారాలు పొందిన నిపుణులను ఏఐజీ చైర్మన్ డాక్టర్ పి.నాగేశ్వరరెడ్డి అభినందించారు.