సమస్య ఓ చోట… సమర్పించేది మరోచోట

ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం. దీంతో వారికి పాస్‌పోర్టు జారీ మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పీవో పీఎస్‌కేలు ఉండగా రోజూ 3,800కి పైగా అపాయింట్‌మెంట్ల ప్రక్రియ సాగుతోంది. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడం, ఆధార్, దరఖాస్తులతో వివరాలు వేర్వేరుగా ఉండటం తదితర కారణాలతో 10 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలాంటి వారు ఆయా సేవా కేంద్రాల్లో మళ్లీ ఇచ్చే అపాయింట్‌మెంట్ తేదీ లోపు అధికారులు సూచించిన వివరాలతో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
చాలా మంది దరఖాస్తుదారులు మాత్రం, అధికారులు సూచించిన తేదీని పట్టించుకోకుండా ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రంలో ఎంక్వయిరీ అపాయింట్‌మెంట్లు తీసుకొని అక్కడ ధ్రువపత్రాలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. తీరా సర్టిఫికెట్లు తీసుకొని అక్కడికి వెళ్లాక తదుపరి ప్రక్రియను అక్కడ పూర్తి చేయరని తెలియడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరుగుతున్నారు. ఈ క్రమంలోనే రీజనల్ పాస్ పోర్టు అధికారులు వారికి అదే పీఎస్‌కేలో మరో అపాయింట్‌మెంట్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.