కొలత్తూరులో సంచలనం.. స్టాలిన్‌ను ఓడించిన వి.ఎస్.బాబు.. ఈయన ఎవరంటే?
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఊహించని సంచలనం నమోదైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో, సిట్టింగ్ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎం. కె. స్టాలిన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వి.ఎస్.బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశారు. 2011 నుండి వరుసగా మూడుసార్లు కొలత్తూరులో విజయం సాధిస్తూ, ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న స్టాలిన్‌కు, ఈ ఓటమి ఊహించని షాక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
డీఎంకేలో కీలక నాయకుడిగా చేసి..
వి.ఎస్.బాబు ఒకప్పుడు డీఎంకేలో కీలక నాయకుడిగా పనిచేశారు. పార్టీలో ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శిగా, 2006లో పురసైవాక్కం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. పార్టీలో జరిగిన అంతర్గత మార్పుల వల్ల ఆయన కొంతకాలం డీఎంకేకు దూరమై, ఏఐఏడీఎంకేలో చేరారు. అనంతరం, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే, స్వయంగా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న కొలత్తూరు స్థానాన్ని తన రాజకీయ ప్రస్థానానికి వేదికగా మార్చుకుని, జేంట్ కిల్లర్(Giant Killer)గా చరిత్ర సృష్టించారు.
డీఎంకేలో దశాబ్దాల పాటు పని చేసిన బాబుకు, పార్టీ అడుగుజాడలు, సంస్థాగత నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ఇది ఆయన విజయానికి ప్రధాన బలంగా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. సంప్రదాయ రాజకీయ పార్టీలపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో టీవీకే సఫలమైంది. వ్యక్తిగత ప్రతిష్టను దాటి, నియోజకవర్గంలోని బూత్ మేనేజ్మెంట్ స్థానిక ఓటర్లతో బాబుకు ఉన్న సత్సంబంధాలు ఈ భారీ విజయాన్ని సాధ్యం చేశాయి.
తమిళనాడు రాజకీయాల్లో మార్పు..
గత ఐదు దశాబ్దాలుగా డీఎంకే ఏఐఏడీఎంకేల మధ్యే అధికారం ఊగుతూ వస్తోంది. అయితే, వి.ఎస్.బాబు విజయం, టీవీకే పార్టీ రాష్ట్రంలో ఒక బలమైన మూడో రాజకీయ శక్తిగా ఉద్భవించిందనేది సుస్పష్టం. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం, తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయనడానికి ఒక సంకేతం. ఈ ఫలితం డీఎంకేకు ఒక పెద్ద రాజకీయ పాఠమని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద, 2026 ఎన్నికల ఫలితాలు తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి.








