అమెరికాలో విద్యార్థుల అరెస్టు వెనుక తప్పెవరిది?

అమెరికాలో విద్యార్థుల అరెస్టు వెనుక తప్పెవరిది?

31-01-2019

అమెరికాలో విద్యార్థుల అరెస్టు వెనుక తప్పెవరిది?

అమెరికాలో బుధవారంనాడు దాదాపు 200 మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన సంఘటన అమెరికాలోని విద్యార్థులను, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల తల్లితండ్రులను సంచలనానికి గురి చేసింది. అమెరికాలో విద్యార్థులు ఇలా మోసపోవడం, అరెస్టు కావడం గతంలో జరిగినా, ఈ సంఘటన మాత్రం అందరిలోనూ ఆందోళనను కలిగించింది. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ట్రంప్‌ ఎన్నడూ లేని విధంగా అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. స్టూడెంట్‌ వీసాతో అమెరికాలో ప్రవేశించి అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నవారిపై కొరడా ఝుళిపించాలన్న ట్రంప్‌ ఆదేశాలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. గతంలోలాగా ఇప్పుడు అన్నీ సవ్యంగా లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి.

అస్సలు ఏం జరిగింది?

అమెరికాలో చదువుకునేందుకు లక్షల సంఖ్యలో విదేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. అందులో భారీ వాటా భారత్‌, చైనాలదే. చదువుకునేందుకు వస్తున్న విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేయకుండా అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని ఇమ్మిగ్రేషన్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. దాంతో పథకం?ప్రకారం మిచిగన్‌ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్‌ హిల్స్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ ఫార్మింగ్టన్‌ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడే విద్యార్థులను గుర్తించాలనుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులో ఇందులో అధికారులుగా అవతారమెత్తారు. అనుకున్నట్లుగానే దళారీలు ఈ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులను చేర్పించడం ప్రారంభించారు. అధికారులు అనుమానం రాకుండా విద్యార్థులకు అవసరమైన పత్రాలను అందజేశారు. అన్నీ ఆధారాలను సేకరించిన తరువాత బుధవారంనాడు తమ అస్సలు రూపాన్ని చూపించి మోసానికి పాల్పడుతున్న విద్యార్థులను అరెస్టు చేయడం ప్రారంభించారు.

విద్యార్థులను చేర్పించిన దళారీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. భరత్‌ కాకిరెడ్డి, సురేష్‌ కందాల, ఫణిదీప్‌ కర్నాటి, ప్రేమ్‌ రాంపీసా, సంతోష్‌ శామా, అవినాష్‌ తక్కళ్ళపల్లి, అశ్వంత్‌ నూనె, నవీన్‌ ప్రత్తిపాటి అరెస్టయిన వారిలో ఉన్నారు. దాదాపు 200 మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేయడంతో అటు అమెరికాలోని తెలుగువారు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లితండ్రులు ఆందోళన చెందారు. అరెస్టయిన తెలుగు విద్యార్థులకు సాయపడేందుకు ఆటా, తానా, నాట్స్‌, టాటా వంటి జాతీయ సంఘాలు రంగంలోకి దిగాయి. మరోవైపు పలువురు ప్రముఖులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

అమెరికా చదువుపైనే మోజు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాలో చదువుకోవడానికి ఇష్టపడుతారు. 2017-18 గణాంకాల ప్రకారం దాదాపు 4.5 మిలియన్‌ స్టూడెంట్స్‌ విదేశీ విద్యలో అమెరికాను నెంబర్‌ 1గా ఎంచుకుంటారు. ప్రతి సంవత్సరం?అమెరికాకు 1.1 మిలియన్‌ విద్యార్థులు చదువుకోసం వస్తుంటారు. ఇందులో భారత్‌, చైనా వాటా ఎక్కువగానే ఉంటుంది. గత సంవత్సరం కన్నా ఈసారి 12శాతం పెరిగిందని చెబుతున్నారు. గత ఐదేళ్ళతో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఇప్పుడు అమెరికాలో 22 లక్షల మంది భారత విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో 25 నుంచి 30శాతం తెలుగు విద్యార్థులు ఉన్నారు. స్టూడెంట్‌ల కోసం ఇచ్చే 100000 వీసాలో 40శాతం తెలుగు విద్యార్థులు ఉంటున్నారు.

National Association of Foreign Students Advisers (ఎన్‌ఎఎఫ్‌ఎస్‌ఎ) ప్రకారం 2017-18 విద్యాసంవత్సరానికిగాను అమెరికాలో 1,094,792 స్టూడెంట్‌లు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు 39 బిలియన్‌ డాలర్లను వారు చదువుకోసం ఖర్చుపెడుతున్నారు. ఇమ్మిగ్రేషన్‌ చట్టాల కారణంగా 2017-18లో విదేశీ విద్యార్థుల రాక 6శాతం తగ్గింది. దీనిపై అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలు ఆందోళన వ్యక్తం?చేస్తూ ఇతర దేశాల్లోని యూనివర్సిటీలు విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయేలా చేస్తోందని వాపోయాయి.

అమెరికాలో విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులకు చదువుకునే సమయంలోనే Curricular Practical Training (సిపిటి) వీసా లభిస్తుంది. ఈ వీసాతో కాలేజీ చదువు పూర్తయ్యేంతవరకు విశ్వవిద్యాలయం ఆవరణలోనే ఏదైనా పనిచేసుకునే అవకాశం ఉంటుంది.

Optional Practical Training(ఓపీటి) ఈ వీసాతో గ్రాడ్యుయేట్‌లు, అండర్‌ గ్రాడ్యుయేట్‌లు 12 నెలల వరకు పనిచేసేందుకు అనుమతి ఉంటుంది. అవసరమైతే దీనిని మరో 17నెలల వరకు పొడిగిస్తారు.

ఈ వీసాలతో పనిచేయవచ్చన్న ఆశతో చాలామంది విద్యార్థులు తమ కోర్స్‌ పూర్తయినా, పూర్తి చేయకపోయినా ఇతర విశ్వవిద్యాలయాల్లో చేరుతూ కాలాన్ని గడిపేస్తుంటారు.

తప్పెవరిది?

మన ప్రముఖులు చెప్పే మాట ఏమిటంటే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడు ఉంటారని, ముగ్గురు భారతీయ సాఫ్ట్‌వేర్‌లలో ఒక తెలుగువాడు ఉంటాడని గొప్పగా, గర్వంగా చెబుతారు. ఇప్పుడు మరోమాట కూడా చెప్పాల్సి ఉంటుంది. అమెరికాలో బయటపడే అక్రమాల్లో మనం ఉంటున్నామనే విషయాన్ని సంఘటనలు చూపిస్తున్నాయి. అమెరికాలో విద్యార్థులు ఇలా తెలిసీ తెలియకమోసపోయిన సంఘటనలు ఇదివరలో కూడా జరిగాయి.

2011లో కాలిఫోర్నియాలో ఉన్న ట్రైవ్యాలీ యూనివర్సిటీలో జరిగిన వీసాల మోసానికి మన విద్యార్థులే బలయ్యారు. దాంతోపాటు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వేలాది డాలర్లను వసూలు చేసి, బాండ్లపై విడుదల చేశారు. డబ్బుకట్టలేని విద్యార్థులను నిర్బంధించారు. మరికొంతమంది విద్యార్థుల కాళ్ళకు రేడియో కాలర్లు అమర్చడం వంటి సంఘటనలు జరిగినప్పుడు అన్యాయమని వాపోయినా అమెరికా అధికారులు ఏమాత్రం చలించలేదు. అప్పుడు తానా ప్రెసిడెంట్‌గా ఉన్న జయరామ్‌ కోమటి వెంటనే స్పందించి విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడంతోపాటు వారిని ఆదుకోవాల్సిందిగా భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించి రంగంలో దిగేలా చేశారు.

2016లో చిన్న చిన్న యూనివర్సిటీలపై, ముఖ్యంగా సిలికాన్‌వాలీ యూనివర్సిటీపై ఇమ్మిగ్రేషన్‌ అధికారులు దృష్టి పెట్టారు. దాంతోపాటు ఈ యూనివర్సిటీలో చేరడానికి వస్తున్న విద్యార్థులను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకుని తీవ్రంగా ప్రశ్నించి సరైన సమాధానం ఇవ్వని విద్యార్థులను అక్కడి నుంచే ఇండియా త్రిప్పి పంపించేశారు. తరువాత నకిలీ యూనివర్సిటీలపై ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కొరడా ఝుళిపించి మూసివేయించారు. కాగా ఇప్పుడు అదే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తామే నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి తమ వలలో చిక్కిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఇబ్బందులు కలిగిస్తున్నారు.

రంగంలోకి దిగిన తెలుగు సంఘాలు

అమెరికాలో జాతీయ తెలుగు సంఘాలైన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వెంటనే స్పందించాయి. ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి విద్యార్థులకు అవసరమైన న్యాయసలహాలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అట్లాంటాలో ఉన్న ఇండియన్‌ అంబాసిడర్‌ హర్షవర్థన్‌ షింగ్లాను, స్వాతి విజయ్‌ కులకర్ణిని ఆటా నాయకులు కలుసుకుని అరెస్టయిన విద్యార్థుల విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన విద్యార్థులకు అవసరమైన న్యాయసహాయాన్ని అందించడంతోపాటు వారు అమెరికాలోనే తమ చదువును కొనసాగించేలా కృషి చేస్తామని చెప్పారు. తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి ఈ సంఘటన తెలిసిన వెంటనే న్యూయార్క్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్ళి కాన్సల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తిని స్వయంగా కలిసి అరెస్టు అయిన విద్యార్థులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

మరోవైపు నాట్స్‌ కూడా రంగంలోకి దిగింది. నాట్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ, నాట్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మంచికలపూడి ఈ విషయమై అమెరికాలోని న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు.

అవగాహన అవసరం

అమెరికాలో తెలుగు సంఘాలు కమ్యూనిటీ బాగుకోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరే విద్యార్థులకోసం అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. అమెరికాలోనే కాకుండా మాతృరాష్ట్రాల్లో కూడా ఇమ్మిగ్రేషన్‌ విషయాలపై కార్యక్రమాలను కూడా చేస్తూ చైతన్యపరుస్తున్నాయి. అమెరికాలో ఏది చేయాలో ఏది చేయకూడదో అన్న విషయంపై తానా ఓ పుస్తకాన్ని కూడా ముద్రించి పంచిపెట్టింది. ఆటా, టాటా, నాట్స్‌ వంటి ఇతర సంఘాలు కూడా ఈ విషయమై అవగాహనను కల్పించేందుకు ప్రయత్నిస్తుంటాయి.

ఏదీ ఏమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులతోపాటు వారి తల్లితండ్రులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిది. దళారీల మాటలు విని ఏదో ఓ కాలేజీలో చేరి ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో వెళితే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.

- చెన్నూరి వెంకట సుబ్బారావు