అమెరికాలో "పాఠశాల" బోధన బాగుంది...మంత్రి గంటా

అమెరికాలో "పాఠశాల" బోధన బాగుంది...మంత్రి గంటా

24-04-2017

అమెరికాలో

బాటా-పాఠశాల టీమ్‌తో మంత్రి భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) సభ్యులను, 'పాఠశాల' టీమ్‌ను కలుసుకున్నారు. మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎపి ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కూడా హాజరయ్యారు. తొలుత విజయ ఆసూరి మంత్రి గంటా శ్రీనివాసరావును, జయరామ్‌ కోమటిని వేదికపైకి ఆహ్వానించారు.

పాఠశాల మేనెజింగ్‌ డైరెక్టర్‌ చెన్నూరి సుబ్బారావు 'పాఠశాల' వివరాలను తెలియజేశారు. ఇ-లెర్నింగ్‌, చిన్నారులకు అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాలతో మాతృభాషను నేర్పిస్తున్నట్లు చెప్పారు. 20 లొకేషన్‌లలో దాదాపు 1,000 మంది చిన్నారులు తెలుగు భాషను నేర్చుకుంటున్నారని తెలిపారు. 

జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, పాఠశాల సిలబస్‌ కూడా సరళంగా ఉందని, అందరూ సులభంగా తెలుగు నేర్చుకోవాలన్నదే 'పాఠశాల' ఆశయమని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ మంగిన, అకడమిక్‌ డైరెక్టర్‌ డా. రమేష్‌ కొండ పాఠశాల టీచర్లను, కో ఆర్డినేటర్లను మంత్రి తదితరులకు పరిచయం చేశారు. బే ఏరియాలో వివిధ చోట్ల జరుగుతున్న తరగతుల వివరాలను చెప్పారు. కరికులం డైరెక్టర్‌ గీతా మాధవి తెలుగు భాషను చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పేలా టీచర్లకు కూడా ట్రైనింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాటా ప్రెసిడెంట్‌ శిరీష బత్తుల బాటా టీమ్‌ను పరిచయం చేశారు. పాఠశాల లక్ష్యాలను సాధించడానికి బాటా టీమ్‌ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో    పాఠశాల విద్యార్థులు నాటికలు, పాటలు, ఏకపాత్రాభినయం వంటివి ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ
, చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలను చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. తన పర్యటనలో తనను ఎంతగానో ఆకట్టుకున్నది 'పాఠశాల' విద్యార్థుల ప్రదర్శనలేనని తెలిపారు. 2వారాల అమెరికా పర్యటనలో 'పాఠశాల'కు సంబంధించిన కార్యక్రమాలను బోధనలను పరిశీలించానని, అవి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వీటిని అమలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. పాఠశాల టీమ్‌ను అభినందిస్తూ, ప్రభుత్వం తరపున పాఠశాలకు కావాల్సిన చేయూతను అందిస్తానని హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల చిన్నారులను అభినందిస్తూ ఉత్తరాలను కూడా పంపిస్తానని కూడా తెలిపారు. 

పాతూరి నాగభూషణం, ధర్మ రామినేని, వేణు రామినేని, వీరు ఉప్పల, కల్యాణ్‌ కట్టమూరి, యశ్వంత్‌ కుదరవల్లి, అరుణ్‌ రెడ్డి, సుమంత్‌, శ్రీదేవి, హరినాథ్‌, శ్రీకర్‌, కొండల్‌ రావు, ప్రశాంత్‌, నరేష్‌, మూర్తి వెంపటి, శ్రీకాంత్‌, యుతిక సరస్వతి, సురేష్‌ శివపురం, రామదాసు, పవన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.


Click here for Photogallery