రాజమండ్రిలో వైభవంగా 'తానా' జానపద కళోత్సవం

రాజమండ్రిలో వైభవంగా 'తానా' జానపద కళోత్సవం

23-04-2017

రాజమండ్రిలో వైభవంగా  'తానా' జానపద కళోత్సవం

రాజమహేంద్రవరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరిగిన ఈ కళోత్సవానికి కళాకారులతోపాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.

తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో తానా సేవలు అందించేందుకు సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి పల్లె రఘునాథరెడ్డికి, ఎంపీ మాగంటి మూరళీమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, గ్రంథాలయాల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. రైతులను ప్రోత్సహించడానికి రైతులకు వ్యవసాయ పరికరాలతో కూడిన పరికరాలను అందజేస్తున్నట్లు చెప్పారు. జానపద కళారూపాలను తానా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.  ఎంపీ మాగంటి మురళీమోహన్‌ మాట్లాడుతూ దేశం రుణం తీర్చుకోవాలని తానా గత 40 ఏళ్లుగా అమెరికాలో వుండి  ఎంతో కృషిచేస్తుందన్నారు.

తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన మాట్లాడుతూ పిడుగురాళ్ల, మాచర్లపల్లి, రేపల్లె, రాజమహేంద్రవరంలో జానపద కళాకారులను ప్రోత్సహించడం కోసమే ఈ కళోత్సవాలు నిర్వహించామన్నారు.

గత 35 ఏళ్లగా ఆంధ్రా, తెలంగాణలలో తానా రూ.300 కోట్లు ఖర్చు చేసి సేవలు అందించిందని తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గోగినేని అన్నారు. మేయర్‌ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ తానా చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఒక నెల ముందుగానే సంక్రాంతి శోభ కనిపించిందన్నారు. టీడీపీ సీనియర్‌నేత గన్నికృస్ణ మాట్లాడుతూ ఇది  రాజమహేంద్రవరం ప్రజలు గర్వించతగ్గ కార్యక్రమం అన్నారు.

తానా కళా ప్రదర్శనలు భళా

తానా ఆధ్వర్యంలో ఏపీ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో  ఏర్పాటు చేసిన జానపద కళోత్సవం ప్రేక్షకులను అలరించింది. వందమంది జానపద కళాకారులు  బృందాలుగా ఏర్పడి వారి వారి ప్రదర్శనలు ఇచ్చారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో  రాజమహేంద్రవరం కళాకారిణిలు తమ ప్రతిభను చాటారు. రాజమహేంద్రవరానికి చెందిన ఉమా నృత్య నికేతన్‌ విద్యార్థినీలు 8 మంది చేసిన కూచిపూడి నృత్యం, శివస్తుతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  అదేవిధంగా శోభానాయుడు మనుమరాలు క్రాంతినారాయణ బృందం  భరతనాట్యం ప్రదర్శన, కుమారి అంబికా  బృందం షాడో డిజిటల్‌ నృత్యం హైలెట్‌గా నిలిచింది. ఒక జవాన్‌ నిజజీవితాన్ని, దేశభక్తిని  షాడో రూపంంలో ఈ నృత్యం చూపించింది. అంతకుముందు 250 మంది కళాకారులు వివిధ వేషధారణలతో, వివిధ కళా ప్రదర్శనలతో డీలక్స్‌ సెంటర్‌ నుంచి ఊరేగింపుగా ఆనం కళా కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఊ రేగింపులో తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, సతీష్‌ వేమన, రవి పొట్లూరి, శ్రీనివాస గోగినేని, మురళీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

సేవలకు సత్కారం ....

తానాలో సభ్యులుగా వుండి వారి వారి కుటుంబ సభ్యులు ద్వారా తెలుగురాష్ట్రాలోని స్వగ్రామాల్లో సేవలు అందిస్తున్నవారిని తానా మెమోంటోలతో సత్కరించింది. నిమ్మలపూడి గిరిదర్‌, పడాల సూర్య ప్రకాష్‌, జనార్థన్‌, మోహన్‌ తదితరులను ఎంపీ మురళీమోహన్‌, మేయర్‌ పంతం రజనీశేషసాయి, గన్నికృష్ణ తానా అధ్యక్షుడు  డాక్టర్‌ వి.చౌదరి జంపాలాలు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తానా ప్రతినిధులు అంజయ్య చౌదరి, రవి పొట్లూరి, జయ్‌ తాళ్లూరి, సుధాకర్‌ కొర్రిపాటి, నిమ్మలపూడి జనార్థన్‌, మంజులత, తులసీమోహన్‌, నవీన్‌వాసిరెడ్డి , అరుణ జంపాలా, సినీ దర్శకుడు వీరభద్రచౌదరి, చిరంజీవి, జీఎస్‌ఎల్‌ చైర్మన్‌ గన్నిభాస్కరరావు, టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు కోరుమిల్లి  విజయశేఖర్‌, పాలిక శ్రీను, మర్రి దుర్గాశ్రీనివాస్‌, పెనుగొండ విజయభారతి, కోసూరి చండీప్రియ, గరగ పార్వతి, సింహ నాగమణి,  నాయకులు మళ్ల వెంకట్రాజు, గాదిరెడ్డి  పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. 


Click here for Photogallery