రైతుల సేవలో 'తానా' - సతీష్ వేమన

రైతుల సేవలో 'తానా' - సతీష్ వేమన

23-04-2017

రైతుల సేవలో 'తానా' - సతీష్ వేమన

రైతుల అభ్యున్నతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం బాసటగా ఉంటూ సాగులో ఆధునిక సాంకేతికతను అందిస్తుందని తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన అన్నారు. మదనపల్లెలో పండిస్తున్న టమోటాను అమెరికాలో తింటున్నామని, జిల్లాలో పండిస్తున్న పలు రకాల పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేసేవిధంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. చిత్తూరు ప్రవాస భారతీయుల  సంఘం సమన్వయకర్త నెక్‌ రమేష్‌ అధ్యక్షతన చిత్తూరులోని జిల్లా పరిషత్‌ సమవేశ మందిరంలో తానా అధ్యర్యంలో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సతీష్‌ వేమన మాట్లాడుతూ అమెరికాలో 40 ఏళ్ల కిత్రం తానా సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. అన్నదాతను ఆదుకోవాలన& ఉద్దేశ్యంతో తానా రైతులకోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రైతులకు సాగులో ఆధునిక సాంకేతిక తను విస్తరించేందుకు పటిష్ఠ ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక్కడ పండుతున్న టమోటా, మామిడి వంటి ఉత్పత్తులకు  గిట్టుబాటు ధర దక్కడం లేదని, విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా పంటలు పండిస్తే ఎగుమతులను ప్రోత్సహిస్తామని సతీష్‌ వేమన పేర్కొన్నారు.

రైతు కోసం పేరుతో తానా రూపొందించిన కరపత్రాలు, సీడీ, ఆడియోలు 2017 నూతన సంవత్సరం క్యాలండర్‌ను డాక్టర్‌ సుందరనాయుడు, సతీష్‌ వేమన, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాస్క్‌లు ధరించే పంటలకు క్రిమిసంహారక  మందులు పిచికారి చేస్తామంటూ అధికారులు, రైతులు చేత సుందరనాయుడు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డాక్టర్‌ సుందరనాయుడు, సతీష్‌ వేమన, జడ్పీ అధికారులు ఘనంగా సత్కరించారు. తానా ప్రతినిధులు అధికారులు, అభ్యుదయ రైతులను సన్మానించారు.  కార్యక్రమంలో చిత్తూరు ప్రవాస భారతీయుల సంగం సమన్వయకర్తలు మహదేవనాయుడు, ఏడీ రమేష్‌, వ్యవసాయాధికారులు శ్రీకాంత్‌రెడ్డి, హిమబిందు, పద్మజ, ఉద్వాన అధకారి కోటేశ్వరరావు, రైతు ప్రతినిధులు గోపాల్‌, హేమాద్రి,  జయచంద్రచౌదరి, సిద్ధయ్యనాయుడు, ప్రవాస  భారతీయులు లోకేష్‌, మోహన్‌కుమార్‌, వ్యవసాయాధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల శ్రేయస్సే తానా  లక్ష్యం : జానయ్య

రైతుల శ్రేయస్సు తానా లక్ష్యంమని రైతుకోసం కార్యక్రమాల ప్రతినిధి జానయ్య అన్నారు. అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని, అందులో భాగంగానే పంటలకు క్రిమిసంహారక మందుల పిచికారి చేసే సమయంలో రక్షణ చర్యలు తీసుకోవడంతో రైతులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రైతు రక్షణ కిట్లను పంపిణీ చేస్తున్నాం. సాగులో యూరియా వినియోగంలో రైతులు నిబంధనలు పాటించడం లేదని తెలిపారు.

రైతులు కావాలనే రోజులు రావాలి : పెంచల కిశోర్‌

తాము రైతులు కావాలనే రోజులు రావాలని జడ్‌పి సిఇఓ పెంచల కిషోర్‌ అన్నారు.  ప్రభుత్వం  రైతులకు  అండగా ఉంటుందని చెప్పారు. తమ  సంపాదనను తమ అభివృద్ధికి కాకుండా రైతుల కోసం ఖర్చు చేస్తామంటూ తానా ముందుకురావడం అభినందనీయమని చెప్పారు.. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు అధిక ఉత్పత్తిని సాధించాలని కోరారు.

వ్యవసాయానికి చేయూత అభినందనీయం : విజయకుమార్‌

రైతు కోసం పేరుతో  తానా కార్యక్రమాలను చేపట్టడం, వ్యవసాయ రంగానికి చేయూతనివ్వడం  అభినందనీయమని వ్యవసాయ శాఖ జెడి విజయకుమార్‌ అన్నారు. పంటలకు పురుగు మందుల పిచికారిని తగ్గించాలి. ప్రస్తుతం రైతులను చూస్తుంటే కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయి.  నాణ్యమైన ఉత్పత్తిని సాధించడంలో విఫలమవుతున్నామని చెప్పారు. రసాయన రహిత పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి. అధిక యూరియా వినియోగం అన్ని రకాల అనర్థాలకు కారణం. పంట మార్పిడి, సేంద్రీయ  సాగు, సమీకృత సాగు విధానాలను అనుసరించాలని కోరారు.

మందుల పిచికారిలో జాగ్రత్తలు తప్పనిసరి : ధర్మజ

పంటలకు క్రిమిసంహారక మందుల పిచికారిలో రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉద్యానవనశాఖ డిడి ధర్మజ అన్నారు. రైతులకోసం తానా రక్షణ కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని చెప్పారు. సాంకేతికతను అనుసరిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. మామిడి పంట ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతులు చేశాం. ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో పంట ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు చేపట్టాం.

తానా కార్యక్రమం హర్షణీయం : డాక్టర్‌ సుందరనాయుడు

పంటల సాగులో రైతులు విధిగా శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు పాటించాలి. రైతులను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో తానా ముందుకు రావడం చాలా సంతోషకరమని డాక్టర్‌ సుందరనాయుడు అన్నారు. విదేశీ ఎగుమతులకు ఉపయోగపడేలా పంట ఉత్పత్తులను పండించాలి. నిరంతర కృషితో కూడుకున్నది వ్యవసాయం. నాణ్యతమైన పంట ఉత్పత్తులతోనే అధిక ఆదాయాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది రైతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 


Click here for Photogallery