బడ్జెట్ తో రాజకీయాలు మారుతాయా?

బడ్జెట్ తో రాజకీయాలు మారుతాయా?

08-07-2019

బడ్జెట్ తో రాజకీయాలు మారుతాయా?

ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాజకీయ ప్రయోజనాలు సాధించేలా ఉన్నాయా?అంటే లేవని చెప్పవచ్చు. దానికితోడు  తాయిలాలు కూసింత వాతలు కొండంత అన్న చందంగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు దాదాపు 75 వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచేశారు. స్టార్టప్‌లు, హౌసింగ్‌ కార్పొరేట్లకు కేటాయింపులు పెంచడం ద్వారా వద్ధికి ఊతాన్ని ఇచ్చినప్పటికీ, ఇతరత్రా వేసిన భారం మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం కనబరిచే విధంగా ఉంది. పెట్టుబడులు, రుణాలకు పెద్ద పీట వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సంకల్పించిన నిర్మలా సీతారామన్‌ ఆదాయం పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. సూపర్‌ రిచ్‌పై భారం వేశారు. ఏడాదిలో కోటి రూపాయలకు పైగా బ్యాంకు నుంచి నగదు తీసుకుంటే రెండు శాతం టీడీఎస్‌ విధించారు. బంగారం నుంచి ఆటో మొబైల్‌ పరికరాల వరకు కస్టమ్స్‌ సుంకం విధించారు.

కాకపోతే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ నవ భారత నిర్మాణంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ అవసరాల పూర్తి, యువతకు ఉపాధి కల్పన, మహిళల సాధికారిత, ఆర్థికాభివద్ధి, పేద ప్రజల అభ్యున్నతి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివద్ధికి అద్దం పట్టింది. నారీని నారాయణిగా మార్చాలన్నది బడ్జెట్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాని ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోని పరిశ్రమలను విదేశీ పరిశ్రమలు కబళించకుండా ఏమీ చేయలేమని మన నేతలు మరోసారి బడ్జెట్‌లో ప్రస్తావించకుండా చెబుతున్నారు. ఓవైపు స్వదేశీ పరిశ్రమలను నెలకొల్పుతామంటూనే మరోవైపు విదేశీ పెట్టుబడులను భారీగా ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ప్రపంచంలోని సగటు 'విదేశీయ ప్రత్యక్ష నిధులు' తగ్గినప్పటికీ మన దేశాన్ని మాత్రం 'విదేశీయ నిధుల వరదలు ముంచెత్తాయట! గ్రామీణ పరిశ్రమల విస్తరణ స్వదేశీయ స్వాభిమానం.. విదేశాల పెట్టుబడులు ఆర్థిక దాస్యం! ఈ అంతర్గత వైరుధ్యాన్ని తొలగించడానికి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది.