జడ్జీల నియామకానికి నీట్‌ తరహా పరీక్ష!

జడ్జీల నియామకానికి నీట్‌ తరహా పరీక్ష!

13-06-2017

జడ్జీల నియామకానికి నీట్‌ తరహా పరీక్ష!

దిగువ కోర్టుల్లో ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన

దిల్లీ: దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి జాతీయ స్థాయిలో నీట్‌ తరహా పరీక్ష అనుసరణీయమేమో పరిశీలించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా సబార్డినేట్‌ కోర్టుల్లో జడ్జి పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయి. 2015 డిసెంబరు 31నాటికే ఈ ఖాళీలు 4,452కు చేరాయి. అప్పటికి 20,502 పోస్టులు మంజూరు కాగా భర్తీ అయినవి 16,050 మాత్రమే. దీనివల్ల వ్యాజ్యాల విచారణలో, తీర్పులు వెలువడటంలో జాప్యం జరుగుతోంది. జడ్జీల నియామకాల కోసం అఖిలభారత స్థాయిలో పరీక్ష నిర్వహించాలని 1960లోనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇటీవల జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న నీట్‌ తరహాలో న్యాయమూర్తుల నియామక పరీక్షను జరపటాన్ని పరిశీలించాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దీంతో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని నియామక కమిటీ కేంద్రీయ పరీక్షా విధానం ద్వారా జడ్జి పోస్టుల భర్తీ చేయటం, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ద్వారా, ఉద్యోగుల నియామకానికి బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలు వంటి వాటినీ పరిశీలించవచ్చంటూ పలు ప్రతిపాదలను సుప్రీంకోర్టు ముందుంచింది.

ప్రభుత్వ, న్యాయ విభాగ ప్రతినిధుల మధ్య ఏప్రిల్‌ 8న జరిగిన చర్చల తదనంతర చర్యగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, జడ్జీల నియామకానికి జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే ప్రతిపాదన పట్ల ఏడు రాష్ట్రాలు సుముఖంగా లేవు. భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ జాతీయ స్థాయి పరీక్షను వ్యతిరేకిస్తుండగా మహారాష్ట్ర మాత్రం అఖిలభారత న్యాయ సర్వీస్‌ (ఏఐజేఎస్‌) ద్వారా నియామకాలు చేపట్టాలని కోరుతోంది. ఏఐజేఎస్‌ ద్వారా నియామకాలు చేపట్టడంపై రాష్ట్రాలు భిన్నస్వరాలను వినిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. ఏఐజేఎస్‌పై పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి న్యాయమంత్రిత్వ శాఖ అందించిన నోట్‌ ప్రకారం బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌, ఒడిశా, ఉత్తారాఖండ్‌ రాష్ట్రాలు భారీ మార్పులు చేయాలని కోరాయి.