రైలులో పారా అథ్లెట్‌కు అవమానం: దిగొచ్చిన సురేశ్ ప్రభు

రైలులో పారా అథ్లెట్‌కు అవమానం: దిగొచ్చిన సురేశ్ ప్రభు

13-06-2017

రైలులో పారా అథ్లెట్‌కు అవమానం: దిగొచ్చిన సురేశ్ ప్రభు

పారా అథ్లెట్ సువర్ణ రాజ్ పట్ల రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. చిన్నతనంలోనే పోలియో సోకడంతో 90 శాతం అంగవైకల్యంతో ఆమె చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించేందుకు ఆమె టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.

రైలులో ఆమెకు టీటీ అప్పర్‌ బెర్తుని ఇచ్చారు. తాను పైకి ఎక్కలేనని, సీటు మార్చాల్సిందింగా టీటీని కోరినా వినిపించుకోకపోగా ఆమె పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దాంతో రాత్రంతా ఆమె కుర్చీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయమై ఆమె కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

'దాదాపు 12 గంటలపైగా అలాగే కూర్చుండిపోయాను. 10సార్లు టీటీని పిలిచాను. కానీ ఆయన రాలేదు. టికెట్‌ను పరిశీలించేందుకు కూడా ఎవరు రాలేదు. రాత్రంతా నేను కుర్చీలోనే నిద్రపోవాల్సి వచ్చింది. నేను అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కావాలని అనడం లేదు. కనీసం మానవత్వంతో మనుషుల్లాగా అయిన ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

'రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఒకసారి వికలాంగుల కోచ్‌లో ప్రయాణిస్తే.. అసలు పరిస్థితి ఏంటనేది ఆయనకు అర్థం అవుతుంది' అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో సువర్ణ రాజ్ పట్ల రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా ప్రవరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.