సినారె మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం

సినారె మృతి పట్ల బండారు దత్తాత్రేయ సంతాపం

12-06-2017

సినారె మృతి పట్ల  బండారు దత్తాత్రేయ సంతాపం

జెనీవా లో అంతర్జాతీయ కార్మిక సదస్సు నందు పాల్గొంటున్న కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పనశాఖామాత్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రాజ్య సభ మాజీ సభ్యులు డాక్టర్ సి. నారాయణ్ రెడ్డ్డి గారి మృతి పట్ల తన సంతాపాన్ని తెలయజేశారు.

తెలుగు సాహిత్యం మరియు  ఉన్నత విద్యలో తెలుగు జాతి గర్వపడేటటువంటి ఉన్నతోన్నత  మహానుభావుడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రాజ్య సభ మాజీ సభ్యులు డాక్టర్ సి. నారాయణ్ రెడ్డి గారు ఇక లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. వారి  మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటు.  

డాక్టర్ సి. నారాయణ్ రెడ్డి గారు తన రచనలో కార్మిక రంగాన్ని కూడా స్పృశించిన విషయం మరిచిపోలేనిది."బొంబాయి పోయిన నా కొడుకు ఏడ ఉన్నడో, ఏం తిన్నాడో" అని ఒక తల్లి ఆవేదనను వారు తన రచనలో ప్రతిబింబించడం నాకు ఇప్పటికీ కన్నీరు తెప్పిస్తూ ఉంటుంది.

తెలుగు సాహిత్య రంగంలో సినీ గేయాలనుండి "విశ్వంభర" వరకు వారు స్పృశించని రంగం లేదు, అధ్యాపకుని నుండి రాజ్య సభ సభ్యుని వరకు డాక్టర్ సి. నారాయణ్ రెడ్డి గారు అలంకరించని పదవులు లేవు, పొందని సత్కారాలు లేవు.  "కళాశాల" పత్రిక సంపాదకుని నుండి ప్రారంభించి  వారు   తెలుగు జాతికి మరో జ్ఞానపీఠ్ పురస్కారం వారందించారు.

డాక్టర్ సి. నారాయణ్ రెడ్డి గారితో నేను ఎన్నో వేదికలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.  వారి చెంత నేను గడిపిన క్షణాలు మరచిపోలేనివి.  వారినుండి నేను నేర్చుకున్నది అంతా ఇంతా కాదు.

ఎంత చెప్పినా తరగని విజయాలు వారి సొంతం.  అందుకే డాక్టర్ సి. నారాయణ్ రెడ్డి గారు లేని లోటు తీరనిది.  వారి ఆశయాలను కొనసాగించడమే వారికి మనం సమర్పించే ఘన నివాళి. వారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

- బండారు దత్తాత్రేయ, కార్మిక మరియు ఉపాధి కల్పనాశాఖ సహాయ మంత్రి (స్వయం ప్రతిపత్తి), భారత ప్రభుత్వం