జూనియర్‌ ఎన్టీఆర్‌తో చంద్రబాబు రహస్య మంతనాలు?

జూనియర్‌ ఎన్టీఆర్‌తో చంద్రబాబు రహస్య మంతనాలు?

19-08-2019

జూనియర్‌ ఎన్టీఆర్‌తో చంద్రబాబు రహస్య మంతనాలు?

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత వైభవాన్ని తిరిగి పొందేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. తెలంగాణలో టీడీపీ మనుగడే ప్రశ్నార్థంగా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్మేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ, వైకాపా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు గోడ దూకుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న టీడీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసి కుదెలైంది. అది నుంచి పార్టీ అధినేత చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముఖ్య నేతలు టీడీపీని వీడి కమలం గూటికి చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఏకాంతంగా సమావేశం సమావేశం అవ్వడం రాజకీయవర్గాల్లో పెనుసంచలనాన్ని సృష్టిసోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎన్టీఆర్‌ వారసుడైన మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ ప్రథమవర్ధంతి సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

హరికృష్ణ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు హరికృష్ణకు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కకు తీసుకెళ్ళి చంద్రబాబు ఏకాంతంగా మంతనాలు సాగించారు. అరంగంటపాటు వారిరువురు మాట్లాడుకున్నారు. కళ్యాణ్‌రామ్‌ కూడా వారితో జతకట్టారు. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదం పునాదులపై నిర్మితమైన తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి తనవంతు సహకారం అందించాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు కోరినట్లు చెబుతున్నారు. పార్టీని రెండు రాష్ట్రాల్లో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సృష్టం చేసినట్లు తెలిపారు.

ఇటీవల విజయవాడలో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయరంగ ప్రవేశం చేస్తే పార్టీ శ్రేణుల్లో మంచి జోష్‌ వస్తుందనే భావనలో ఉన్నట్లుగా సమచారం. ఇదే జరిగితే పార్టీకి పూర్వ వైభవం తధ్యమని రాజకీయ విశ్లేషకులు, తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు.