అంబేడ్కర్ స్ఫూర్తితో పోరాటం : చంద్రబాబు

అంబేడ్కర్ స్ఫూర్తితో పోరాటం : చంద్రబాబు

15-04-2019

అంబేడ్కర్ స్ఫూర్తితో పోరాటం : చంద్రబాబు

దేశంలో రాజ్యాంగబద్ద సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ఆవరణలోని ఆయన విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అంబేడ్కర్‌ దేశ ప్రజలకు కత్తి ఇవ్వలేదని, కత్తి కన్నా పదునైనా ఓటు హక్కు ఇచ్చి...వినియోగించుకుని రాజులవుతారో? అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాలని సూచించారని చెప్పారు. రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేడ్కర్‌ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. దేశాన్ని కొంత మంది లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేసి రూ.2వేల నోట్లు తెచ్చారని, ఆ నోట్లతో రాజకీయాలు నీచంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రఫెల్‌ వివాదం రావణాకాష్ఠంలా మండుతోందని పేర్కొన్నారు. ప్రధానిగా ఉండేందుకు ఎన్ని తప్పులైనా చేస్తామన్నట్లుగా మోదీ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.