నిరుద్యోగ భృతి మరింత పెంచుతాం: చంద్రబాబు

నిరుద్యోగ భృతి మరింత పెంచుతాం: చంద్రబాబు

22-03-2019

నిరుద్యోగ భృతి మరింత పెంచుతాం: చంద్రబాబు

రాష్ట్రానికి ఉన్న అత్యున్నతమైన ఆస్తి యువతేనని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు నిరుద్యోగ భృతి తీసుకొచ్చినట్టు చెప్పారు. అవసరమైతే ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తున్న రూ.2వేలకు మించి ఎక్కువ భృతిని చెల్లిస్తామని ప్రకటించారు. యువతకు తానే ఓ సంరక్షుడిగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొనేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, తెదేపా ఆస్తులపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రతి వీధిలో ఒక రౌడీ తయారవుతారని విమర్శించారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని జగన్‌ కోరుతున్నారని.. కానీ ఇది ప్రజల భవిష్యత్తు అన్నారు. తెలిసి తెలిసి ఎవరైనా మరణ వాంగ్మూలం రాసుకుంటారా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఏకమైతే ఏమవుతుందో చూస్తారని ప్రధాని మోదీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన ఆస్తులు మనకు ఇవ్వని తెరాసతో వైకాపా అధ్యక్షుడు జగన్‌ కలిశారని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో విజయనగరం-విశాఖ కలిసిపోయి మరో కొత్త నగరం వస్తుందన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని.. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లే తనకు విరోధులని అన్నారు. అభివృద్ధిలో కేసీఆర్‌ కూడా మనతో పోటీ పడలేకపోతున్నారని.. అందుకే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వస్తే యూపీ, బిహార్‌లా రాష్ట్రం తయారవుతుందన్నారు.