నాట్స్ తెలుగు సంబరాల్లో రెండో రోజు ప్రముఖుల సందడే సందడి..

నాట్స్ తెలుగు సంబరాల్లో రెండో రోజు ప్రముఖుల సందడే సందడి..

02-07-2017

నాట్స్ తెలుగు సంబరాల్లో రెండో రోజు ప్రముఖుల సందడే సందడి..

నాట్స్ తెలుగు సంబరాల్లో రెండో రోజు ఉదయం ప్రారంభ కార్యక్రమంలో  ఆధ్యాత్మిక వేత్తల ఆశీస్సులు, ప్రవచనాలు... ప్రముఖుల సందడే సందడి..

తరలివచ్చిన తారలోకం.. హోరెత్తిన సంగీతం.. ఊర్రూతలూగించిన ఆట.. పాట.

అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. సంబరాల రెండవ రోజు పూర్ణ కుంభాబిషేకంతో ప్రారంభమైంది.. జ్యోతి ప్రజ్వలన, ప్రారంభ కార్యక్రమానికి విశ్వయోగి విశ్వంజీ, కొండవీటి జ్యోతిర్మయి,  నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి, నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , డా. ముక్కామల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.  ఆ తర్వాత జరిగిన సుదర్శన హోమం లో లో నాట్స్ బోర్డు ఈ. సి సభ్యులు పాల్గొన్నారు.  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు విశ్వయోగి విశ్వంజీ, చిన్మయ సేవా ట్రస్ట్ ఆధ్యాత్మిక గురువులు చిదాత్మనంద తో పాటు ఇషాత్మనంద ప్రబోధాలు భక్తులను భక్తి మార్గంలో పయనింపచేసేలా సాగాయి. సంబరాల నిర్వహాణ పరమార్థం ఏమిటనేది తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్  రవి అచంట వివరించారు.

తెలుగువారంతా ఇలా సంబరాలను అంబరాన్నంటేలా చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ మెన్ రాజా కిషోర్ మూర్తి అన్నారు. శ్యాంబర్గ్ లో ఇంతమంది తెలుగువారు ఒక చోట చేరి పండుగలా చేసుకోవడం వారి ఐకమత్యాన్ని సూచిస్తుందని..ఇలాంటి సంబరాలతో సంస్కృతీ, సాంస్కృతిక సంబంధాలు కూడా బలపడతాయని శ్యాంబర్గ్ మేయర్ ఎ ఎల్ లారన్స్ అన్నారు. ఆ తర్వాత వసుదైక కుటుంబం పేరుతో సంబరాల టీం చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. మనమంతా ఒకటే అనేది నృత్యం చూపించిన తీరు అద్భుతమైన స్పందన లభించింది. హైదరాబాద్ నించి ఇక్కడకు వచ్చి షుమారు 80 మంది స్థానిక కళాకారులచే  అతి తక్కువ వ్యవధిలో నేర్పించి ఇంత అద్భుతంగా తీర్చి దిద్దిన పెద్దుల నరసింగరావు, పెద్దుల శ్రీనివాస్, వేణు ల కృషి ని , కూచిపూడి కళాకారిణి శోభా తమ్మన, భారత నాట్య కళాకారిణిని ఆషా ల చే శిక్షణ పొంది నాట్యం చేసిన చిన్నారులను సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు  ప్రత్యేకంగా అభినందించారు. 

పద కవితా పితామహుడు అన్నమయ్య గానమృతం కార్యక్రమంలో కొండవీటి జ్యోతిర్మయి అనేక అన్నమయ్య గీతాలను ఆలపించి తియ్యటి గానమృతాన్ని పంచారు. గాన గంధర్వుడు మంగళపల్లి బాలమురళీకృష్ణ ను గుర్తు చేసుకుంటూ. చేసిన కార్యక్రమం కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ప్లూట్ డ్యాన్స్ కు మంచి స్పందన లభించింది.  మిమిక్రి నవ్వుల పువ్వులు పూయించింది.  మనలోని మనిషి అంటూ మానవత్వాన్ని మేలుకొల్పే రూపకం ఆకట్టుకుంది..స్థానిక కళకారులతో చేసిన లంబాడా డ్యాన్స్ అందరితో చిందులు వేయించింది. ఆ తర్వాత జరిగిన సాహిత్య కార్యక్రమాలు..సాహితీ ప్రియులను ఆకట్టుకున్నాయి

 

Click here for Event Gallery