భళా...బాటా నాయకుల నాటక ప్రదర్శన

భళా...బాటా నాయకుల నాటక ప్రదర్శన

26-01-2020

భళా...బాటా నాయకుల నాటక ప్రదర్శన

అమెరికాలో తెలుగునాటికలను ప్రదర్శించడంలో స్వరాష్ట్రంలో ఉన్నవారికన్నా ఎన్నారైలే ముందుంటున్నారు. తెలుగుసంఘాలు తాము నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటికలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దానికితోడు ఈ నాటికల్లో నటించేందుకు ఎన్నారైలు ఎంత శ్రద్ధగా శిక్షణ తీసుకుంటారో గమనిస్తే ఆశ్చర్యపోవచ్చు. అమెరికాలాంటి దేశంలో ఉపాధికోసం వెళ్ళిన ఎన్నారై తెలుగువారు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కాని కమ్యూనిటీకి సేవ చేయాలన్న తలంపుతో తెలుగుసంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ తమకు నచ్చిన అంశాల్లో ప్రదర్శనలిచ్చేందుకు ముందుకు వస్తుంటారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) విభిన్న కార్యక్రమాలను నిర్వహించడంలో ఎల్లప్పుడూ ముందుంటోంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటికకు ప్రాధాన్యం ఇస్తూ, అందరూ మెచ్చేలా నాటికను రూపొందిస్తుంటుంది. సాంఘిక నాటకాలను ప్రదర్శించడం ఈజీ అయినప్పటికీ కష్టమైన చారిత్రాత్మక నాటికలను ప్రదర్శించడంలో కూడా తాము ఎవరికీ తీసిపోమని బాటా నాయకులు మరోసారి నిరూపించారు.

బాటా ఇటీవల నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో బాటా నాయకులు విజయనగర స్థాపనం పేరుతో చారిత్రాత్మక నాటికను ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. నేటితరానికి అర్థమయ్యే విధంగా ఈ నాటికను రూపొందించుకుని ప్రదర్శించడం, ఇందులో నటించడానికోసం బాటా నాయకులు శ్రద్ధగా విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలుసుకుని రిహార్సల్‌ చేశారు. ఈ చారిత్రాత్మక నాటకాన్ని ప్రముఖ రంగస్థల నటుడు డా. రవి నరాలసెట్టి రచించి దర్శకత్వం వహించారు. కృష్ణదేవరాయల పాత్రను డా. రవి నరాలసెట్టి పోషించగా, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు పాత్రను వేణు ఆసూరి, హరిహరరాయలు పాత్రను ప్రసాద్‌ మంగిన, బుక్కరాయలు పాత్రను కామేష్‌ మల్ల, విద్యారణ్య స్వామి పాత్రను కళ్యాణ్‌ కట్టమూరి, సేనాపతి పాత్రను కృష్ణ గొంప పోషించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను కీబోర్డ్‌, తబలాను సమీర్‌ మాండలిక సమకూర్చారు. నరసింహరావు, శ్రీదేవి పసుపులేటి మేకప్‌ వ్యవహారాలను చూశారు.

విజయనగర సామ్రాజ్య స్థాపన ఎలా జరిగిందో ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా చూపడంతోపాటు, హరిహర బుక్కరాయల సోదరులు ముస్లిం దురాక్రమణకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆర్య ధర్మ సంరక్షణార్థం సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న తలంపుతో వారు తుంగభద్రా నదితీరానికి వచ్చినప్పుడు వారికి ఎదురైన దృశ్యాలను సహజంగా ఈ నాటికలో ప్రదర్శించి చూపడం విశేషం. ఆ ప్రాంతంలో ఒక కుందేలు రెండు కుక్కలను తరమడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయి, ఈ ప్రాంతం మహిమ అని గుర్తించడంతోపాటు స్వామి విద్యారణ్యను చూసి, ఆయన ముఖంలో కనిపించిన బ్రహ్మతేజస్సును గమనించి ఆయనకు వారు శిష్యులుగా మారారు. ముస్లింల నిరంతర దండయాత్రలతో విసిగి, ఒక ఆర్యధర్మ సంరక్షణకోసం సామ్రాజ్యాన్ని నిర్మించాలని తలపెట్టాము. ఆశీర్వదించాల్సిందిగా కోరినప్పుడు, ఇది దేవతా భూమి అని, శ్రీరామలక్ష్మణులు నడయాడిన భూమి అని చెబుతూ ఈ ప్రాంతం ధైర్యసాహసాలకు పెట్టింది పేరని మీరు చూసిన కుందేలు కూడా ఈ స్థల మహత్యంతో జాగిలాలను తరమికొట్టిందని చెప్పారు. ఇక్కడే మీ సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిందిగా కోరారు. అలా విజయనగర సామ్రాజ్య స్థాపన ప్రారంభమైందని ఈ నాటికలో చూపారు.

ఈ నాటిక ఆద్యంతం ఆసక్తిగా, అందరికీ నచ్చేలా, మెచ్చేలా రూపొందించి ప్రదర్శించడంతో ఈ కార్యక్రమానికి వచ్చినవారంతా ఈ నాటకాన్ని చూసి అభినందించకుండా ఉండలేకపోయారు. దానికితోడు ఆంధ్ర మహావిష్ణు ఆలయం, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద రచన, తెలుగుభాషావైభవాన్ని చాటిచెప్పిన తెలుగుదేలయన్న పద్యపఠనం వంటివి ఈ నాటకం అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ఇలాంటి నాటకాన్ని ప్రదర్శించి చారిత్రాత్మకమైన విజయనగర సామ్రాజ్య స్థాపనను నేటితరానికి సులభంగా తెలియజేసినందుకు పలువురు బాటా నాయకులను, నాటక రచయిత, దర్శకులను, నటీనటులను అభినందించారు.

Click here for Event Gallery