దావోస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన!

దావోస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన!

25-01-2020

దావోస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన!

ప్రజారోగ్య పరిరక్షణ (మెడికేర్‌), ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే ఏడాది నుండి నిధుల కేటాయింపుల్లో కోత పెట్టే అంశాన్ని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటును తగ్గించేందుకు సంక్షేమ కార్యక్రమాలకు కోత విధించాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టే అంశం మీ ఎజెండాలో వుందా అన్న ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ వుండే అవకాశముందన్నారు.

ఈ కార్యక్రమాల జోలికి పోనంటూ 2016 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇది విరుద్దం కదా? అని ప్రశ్నించినపుడు ఆయన బదులిస్తూ ఇటీవల ఆర్థిక ప్రగతి మందగించి దేశ ఆర్థిక వ్వవస్థ లోటులోపడిన విషయాన్ని ప్రస్తావించారు. తమ దేశం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని, నిరుద్యోగిత కూడా అతి తక్కువని, ఆఫ్రికన్‌ అమెరికన్లు, ఆసియన్‌ అమెరికన్లు హిస్పానిక్‌లు కలిసి మెలిసి జీవిస్తున్నారని వివరించారు. మెడికేర్‌ కార్యక్రమానికి కోతలతో పాటు ప్రజల వైద్య సహాయం నిమిత్తం రాష్ట్రాలకు అందచేసే గ్రాంట్లు, మినహాయింపులను కూడా తొలగించాలని భావిస్తున్నామన్నారు.