అమెరికాలో జనగణన మొదలైంది

అమెరికాలో జనగణన మొదలైంది

25-01-2020

అమెరికాలో జనగణన మొదలైంది

అమెరికాలో జనగణన మొదలైంది. మనదేశంలో మాదిరిగానే అక్కడ పదేళ్ల కోమారు పక్కాగా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రజలకు ఇచ్చే మార్గదర్శక సమాచారాన్ని 59 భాషల్లో రూపొందించారు. తెలుగుతోపాటు 7 భారతీయ భాషలకు చోటుకల్పించారు. జనగణనలో పాల్గొనడానికి ఏమేం చేయాలి, ఎలా సమాచారం ఇవ్వాలనే అంశాలన్నీ ఈ భాషల్లో చదువుకోవచ్చు. వీడియో చిత్రాలు సైతం ఆయా భాషల్లో రూపొందించారు. ఎక్కువ మంది మాట్లాడే భాషలకు ఇందుకు ఎంపిక చేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. తెలుగుతోపాటు బెంగాలీ, గుజరాతీ, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీల్లో ఈ సమాచారం రూపొందించారు. అయితే, ఈ సమాచారం ఆధారంగా ప్రజల్ని అడిగే ప్రశ్నావళిని మాత్రం 13 భాషల్లో మాత్రమే సిద్దం చేశారు.

ఈ ప్రశ్నావళి తెలుగులో లేదు. 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమెరికాలో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తారు. అలస్కాలో మారుమూల సముద్ర తీర గ్రామం టోక్‌సుక్‌ లో మాత్రం ఇప్పటికే జనాభా లెక్కల్ని ప్రారంభించారు. ఏప్రిల్‌ నాటికి వాతావరణం అనుకూలించని ప్రాంతాల్లో ఇప్పుడు సేకరిస్తున్నారు. మెయిల్‌ లేదా ఫోన్‌ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వొచ్చు. జనగణనలో పాల్గొనాలంటూ దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మెయిల్‌ లేదా ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేస్తారు. ఇందులో పాల్గొనడం ఎంత అవసరమో ప్రజలకు వివరించేందుకు రూ.3500 కోట్లతో అమెరికా ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తోంది.