అమెరికాలో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

అమెరికాలో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

19-08-2019

అమెరికాలో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత పెట్టుబడులు ఇతోధికమవుతున్నాయి. జూన్‌ చివరికి 6 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 162.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అమెరికా ఖజానా విభాగం తాజా గణాంకాలను పరిశీలిస్తే.. అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరంగా అగ్రస్థానంలో జపాన్‌ ఉంది. ఆ దేశ పెట్టుబడులు 1.122 లక్షల కోట్లు (ట్రిలియన్‌) డాలర్లు మేర ఉండగా, ఆ తర్వాత చైనా 1.112 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉంది. అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడుల పరంగా భారత్‌ 162.7 బిలియన్‌ డాలర్లతో 13వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మే చివరికి 156.9 బిలియన్‌ డాలర్లు, ఏప్రిల్‌ చివరికి 155.3 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే క్రమంగా పెరిగినట్టు తెలుస్తోంది. 2018 జూన్‌ నాటికి 147.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పోల్చి చూసుకుంటే సుమారు 10 శాతానికి పైగా పెరిగాయి.

అంతర్జాతీయ ఆర్థిక రంగం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న సమయంలోనూ భారత ఎక్స్‌పోజర్‌ అధికం కావడం గమనార్హం. బ్రిటన్‌ 341.1 బిలియన్‌ డాలర్లు, బ్రెజిల్‌ 311.7 బిలియన్‌ డాలర్లు, ఐర్లాండ్‌ 262.1 బిలియన్‌ డాలర్లు, స్విట్జర్లాండ్‌ 232.9 బిలియన్‌ డాలర్లు, హాంకాంగ్‌ 215.6 బిలియన్‌ డాలర్లు, బెల్జియం 203.6 బిలియన్‌ డాలర్లు, సౌదీ అరేబియా 179.6 బిలియన్‌ డాలర్లు, తైవాన్‌ 175.1 బిలియన్‌ డాలర్లతో భారత్‌ కంటే ముందున్నాయి.