ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయి : ట్రంప్

ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయి : ట్రంప్

13-04-2019

ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయి : ట్రంప్

ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. వైట్‌హౌస్‌లో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌జే ఇన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్‌ పై వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర పరీక్షా కేంద్రాలను ధ్వంసం చేసినట్టయితే ఉత్తరకొరియాపై మోపిన ఆంక్షలను ఎత్తివేస్తామని ట్రంప్‌ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ శాంతి కోసం అణ్వస్త్రాలను విడనాడాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో గతేడాది జూన్‌ 12న ఇరుదేశాధినేతలు తొలిసారిగా భేటీ అయ్యారు. ఉత్తరకొరియాపై ఆంక్షలు, అణ్వస్త్ర పరీక్షా కేంద్రాల మూసివేత తదితర అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ భేటీ ఫలప్రదమైందని ట్రంప్‌ ప్రకటించారు. తదనంతరం అంతర్జాతీయ మీడియా సంస్థల సాక్షిగా ఉత్తరకొరియాలోని అన్ని అణ్వస్త్ర పరీక్షా కేంద్రాలను కిమ్‌ సర్కార్‌ ధ్వంసం చేసింది. అయితే, కిమ్‌ చర్యల అనంతరం ట్రంప్‌ స్వరం మారింది. ఇచ్చిన మాట తప్పిన ట్రంప్‌ ఉత్తరకొరియాపై ఆంక్షలను కొనసాగించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న హానోయ్‌లో కిమ్‌, ట్రంప్‌ మధ్య జరిగిన రెండోదఫా భేటీ కూడా విఫలమైంది. ఉత్తరకొరియాపై మోపిన ఆంక్షలన్నింటినీ రద్దు చేయాలని కిమ్‌ చేసిన డిమాండ్‌కు తలొగ్గేది లేదని ట్రంప్‌ తేల్చి చెప్పారు. ఉత్తరకొరియాతో మూడో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ వెల్లడించినట్టు మూన్‌ జే ఇన్‌ పేర్కొన్నారు.