సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో అమరావతి భాషా శాస్త్ర పీఠం - చంద్రబాబు !

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో అమరావతి భాషా శాస్త్ర పీఠం - చంద్రబాబు !

07-05-2017

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో అమరావతి భాషా శాస్త్ర పీఠం - చంద్రబాబు !

అమెరికాలో పర్యటనలో భాగంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కు విచ్చేసారు. ఉదయం 10 గంటలకు మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ - డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనానికి చేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ధిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, డా. పరకాల ప్రభాకర్ బృందానికి  అచ్చమైన తెలుగు సంప్రదాయ వస్త్రధారణ లో  వేద మంత్రాలతో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల,అజయ్ గంటి మరియు ఇతర  సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. 

అమెరికాలో భారతీయ కళలైన కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యాలలో ఎం ఏ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్స్‌లు  అందించే మొట్ట మొదటి విశ్వవిద్యాలయమైన సిలికానాంధ్ర యూనివర్సిటీ అన్ని బ్లాకులను ముఖ్యమంత్రి పరిశీలించారు. సిలికానాంధ్ర ఇంతవరకు చేసిన కార్యక్రమాలను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీలను ఆసక్తి తో గమనించి సిలికానాంధ్ర కార్యకలాపాలను ప్రశంసించారు.

సిలికానాంధ్ర సభ్యులు, కిక్కిరిసిన అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికాలో ఉంటూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఇంత అద్భుతంగా పరిరక్షిస్తున్నందుకు సిలికానాంధ్ర ఎంతో ఆదర్శవంతమైనదని అన్నారు. ఎన్నో రంగాలలో విజయాలు సాధించిన ఎంతో మంది తెలుగు వారు అమెరికాలో ఉన్నారని, కానీ సిలికానాంధ్ర చేసిన విధంగా భాష, సంస్కృతి పరిరక్షణ ఇంకెవరూ చేయలేదని ప్రశంసిస్తూ,   మన కళలు, సంప్రదాయాలు, నాగరికతను ప్రతిబింబించే విధంగా ఎంతో ఆదర్శవంతంగా ఏర్పాటు చేసిన సిలికానంధ్ర విశ్వవిద్యాలయం లో మిలియన్ డాలర్లతో  అమరావతి భాషా శాస్త్ర కేంద్రం (Amaravathi School of Linguistics Chair) ఏర్పాటు చేస్తామని, యూనివర్సిటీ అభివృద్ధికి అన్నివిధాలుగా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. మనబడి దశాబ్ది వేడుకల లోగో ని విడుదల చేస్తూ,  పాతిక వేల మందికి పైగా పిల్లలకి తెలుగు నేర్పే 'మనబడి ', తెలుగు భాషను  ముందు తరాలకి అందించడం లో కొత్త ఒరవడి సృష్టించిందని,..ఇది ఎంతో శుభపరిణామని అన్నారు. సిలికానాంధ్ర అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారు  ముఖ్యమంత్రి గారిని సంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించి, ముఖ్యమంత్రి గారికి, ఈ కార్యక్ర్మమం విజయవంతం కావడానికి సహకరించినAPNRT అద్యక్షులు డా. వేమూరి రవి, డా. రాజా, సాల్మన్ రాజా, సాగర్ దొడ్డపనేని, సాయి కుమార్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమానంతరం, సీ ఎం అమెరికా పర్యటన విజయవంతం అవ్వాలని,తెలుగు భాష సంస్కృతి ని ప్రపంచానికి చాటాలని  48 మంది సిలికానాంధ్ర సభ్యులు 4 జట్లుగా ' సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే ' ప్రతిష్టాత్మక 191 మైళ్ళ మారథాన్ లో 'తెలుగు కు పరుగు ' (Run4Telugu) పేరిట పరుగును ప్రారంభించారు.    

 

Click here for Photogallery