న్యూయార్క్ రాష్ట్ర విభజన కోసం కొత్త బిల్లు

న్యూయార్క్ రాష్ట్ర విభజన కోసం కొత్త బిల్లు

11-02-2019

న్యూయార్క్ రాష్ట్ర విభజన కోసం కొత్త బిల్లు

న్యూయార్క్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలి అన్ని ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తున్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రిపబ్లికన్‌ అసెంబ్లీమేన్‌ స్టీవ్‌హాలే ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. న్యూయార్క్‌ ఉత్తర ప్రాంతం(అప్‌స్టేట్‌) నుంచి దక్షిణ ప్రాంతాన్ని (డౌన్‌స్టేట్‌) వేరుగా విభజించాలని ఆయన కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఉత్తర ప్రాంత ప్రజలకు, దక్షిణ ప్రాంతం వారికి సాంపాదన విషయంలో, ఖర్చు విషయంలో ఇలా ప్రతి అంశంలో వారికీ.. వీరికి మధ్య అనేక తేడాలు ఉన్నాయని అందుకే న్యూయార్క్‌ను రెండుగా విభజించాలని తాను ప్రతిపాదించినట్టు స్టీవ్‌ తెలిపారు. అయితే ఇది ఆచరణలో సాధ్యమవుతుందా అనే అంశంపై మరింత చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీలో పాసైతే.. ఇక ఓటర్లదే తుది నిర్ణయమని ఆయన సృష్టం చేశారు. అబార్షన్‌ బిల్‌, గన్‌ కంట్రోల్‌, డ్రీమ్‌ యాక్ట్‌ వంటి వివాదాస్పద బిల్లులు కూడా ఇటీవల అసెంబ్లీలో అమలయ్యాయని.. ఈ బిల్లు కూడా వాటిలాగే అమలవుతుందని ఆశిస్తున్నానన్నారు. 

మరోపక్క డెమొక్రాటిక్‌ అసెంబ్లీమేన్‌ సియాన్‌ ర్యాన్‌ దీన్ని ఖండించారు. ఉత్తర అమెరికాలో ఉంటున్న ధనికుల నుంచే న్యూయార్క్‌ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తోందని.. కలిసి ఉన్న రాష్ట్రాన్ని విభజించి దక్షిణ న్యూయార్క్‌ను ప్రకటిస్తే అది దిక్కులేని రాష్ట్రంగా రెవెన్యూ లోటులో మునిగిపోతుందని హెచ్చరించారు. ఆర్థిక పరంగా చూస్తే రాష్ట్రాన్ని విభజించడం కష్టమైన ఆంశమని సృష్టం చేశారు.