మీ డీఎన్‌ఏలోనే టెక్నాలజీ : రాష్ట్రపతి

మీ డీఎన్‌ఏలోనే టెక్నాలజీ : రాష్ట్రపతి

02-09-2017

మీ డీఎన్‌ఏలోనే టెక్నాలజీ : రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌ యువత డీఎన్‌ఏలోనే టెక్నాలజీ ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనార్థం రామ్‌నాథ్‌ తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్‌ కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర సత్కారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సాంకేతికత వినియోగంలో రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విజయాలు సాదిస్తున్నారని, ఆవి దేశ ప్రతిష్ఠను పెంచుతున్నాయని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.

దేశంలోని డైనమిక్‌ రాష్ట్రల్లో ఏపీ ఒకటని కొనియాడారు. రాష్ట్ర పర్యటనకు రావడం ఇక్కడి ప్రజల నుంచి పౌరసత్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.  ఎన్టీరామారావు, పి.వి.నరసింహారావు లాంటి గొప్ప నాయకులను, ముగ్గురు రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డిని తెలుగు ప్రజలు దేశానికి అందించారన్నారు. ఇప్పుడు తన సహచరుడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగువారే కావడం విశేషమన్నారు. అభివృద్ధిపరంగా ఏపీ శరవేగంగా ప్రగతి సాధిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విభజన అనంతరం మూడేళ్ల కాలంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు.