నంద్యాలలో టీడీపీ, వైసీపీ కొత్త ఎత్తుగడ ఇదేనా?

నంద్యాలలో టీడీపీ, వైసీపీ కొత్త ఎత్తుగడ ఇదేనా?

19-08-2017

నంద్యాలలో టీడీపీ, వైసీపీ కొత్త ఎత్తుగడ ఇదేనా?

నంద్యాల ఉప ఎన్నికల్లో కార్యకర్తలకు, ఓటర్లకు డబ్బులు పంచేందుకు, మద్యాన్ని అందించిందుకు కొత్త టెక్నిక్ లను కనిపెట్టారు పార్టీల నేతలు. ఎవరికీ దొరకకుండా….ఎన్నికల కమిషన్ కు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక అంటేనే కార్యకర్తలను ప్రచారం పూర్తయ్యేంత వరకూ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వారికి ఏ మాత్రం తక్కువ జరిగినా మరుసటి రోజు ప్రచారానికి డుమ్మా కొడతారు. జనం లేకుండా ప్రచారానికి వెళితే అభ్యర్థి పరువు పోవడమే కాకుండా, ప్రజల్లో కూడా పరపతి తగ్గుతుంది. ఇందుకోసం గత పక్షం రోజుల నుంచి కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నాయి రెండు పార్టీలు. వారికి రోజు వారీ భత్యంతో పాటుగా, ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మందు కూడా ఇస్తున్నారు. మద్యం వద్దన్న వారికి అదనంగా డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఒక్కొక్క పార్టీకి రోజుకు ప్రచారం కోసమే రెండు కోట్లు ఖర్చవుతున్నాయంటే ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో చెప్పనవసరం లేదు.

ఒకరు భోజనం టిక్కెట్… ఒకరు జగన్ టిక్కెట్…..

అయితే టీడీపీ కొత్త ఎత్తుగడకు దిగింది. ‘అన్నపూర్ణ హోటల్’ స్లిప్ కార్యకర్త ఇస్తే చాలు మద్యంతో పాటు, ఆరోజు భత్యం, టిఫిన్, భోజనం ఫ్రీ. అభ్యర్థులు నేరుగా చెల్లించకుండా ఈ స్లిప్ ఇచ్చిన వారికే వాటిని ఇచ్చే విధంగా టీడీపీ ఏర్పాటు చేసుకుంది. అందుకే నంద్యాలలో అన్నపూర్ణ హోటల్ స్లిప్పులు ఎక్కడ పడితే అక్కడ కన్పిస్తున్నాయి. ఒక్క స్లిప్ విలువ దాదాపు వెయ్యి రూపాయలకు పై చిలుకే. ఈ స్లిప్ లు రోజూ ఉదయాన్నే కార్యకర్తలకు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే వైసీపీ కూడా ఏం తక్కువ తినలేదు. ‘జై జగన్…జైజై వైఎస్సాఆర్’ అని ముద్రించిన స్లిప్పులను వైసీపీ పంచుతోంది. ఈ స్లిప్పులను చూపిస్తేనే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంది వైసీపీ. ఇలా ఎన్నికల కమిషన్ కు దొరకకుండా అన్ని దారులనూ వెతుకుతున్నాయి రెండు పార్టీలు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో ఎక్కువ మంది కార్యకర్తలను నియమించుకుంటున్నారు. ఈ మూడు రోజుల ప్రచారమే కీలకం కావడంతో ఎంత డబ్బును వెచ్చించడానికైనా సిద్ధపడుతున్నాయి టీడీపీ, వైసీపీలు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నంద్యాల లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్న వైనంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.