ASBL Koncept Ambience
facebook whatsapp X

Social Media : వైసీపీ నేతల్లో పశ్చాత్తాపం మొదలైందా..!?

Social Media : వైసీపీ నేతల్లో పశ్చాత్తాపం మొదలైందా..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా పేరెత్తితేనే భయపడిపోతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ ఏం పీకలేరనే ధైర్యంతో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. విపక్షాలకు చెందిన నేతలు, వాళ్ల కుటుంబసభ్యులను కించపరుస్తూ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు.

వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు వందమందికి పైగానే ఈ అరెస్టులు ఉండొచ్చని అంచనా. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై కొంతమంది వైసీపీ అబిమానులు, నేతలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. వాటిపై గతంలోనే విపక్ష నేతలు ఫిర్యాదులు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే విపక్ష నేతలు పెట్టిన పోస్టులపై మాత్రం నాటి జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. దేశద్రోహం కింద కూడా కొంతమందిపై కేసులు నమోదు చేసింది.

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. బూరగడ్డ అనిల్, వర్రా రవీంద్ర రెడ్డి, కళ్లం హరిప్రసాద్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిపైన కేసులు నమోదయ్యాయి. ఈ జాబితా ఇంతటితో ఆగదని.. త్వరలో మరింతమంది పైన కేసులు నమోదవుతాయని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపైన కేసులు నమోదవుతుండడంతో వైసీపీ అధిష్టానం కంగారు పడుతోంది. ఇలాంటి వాళ్లందరికీ న్యాయ సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా విడుదల చేసింది.

అయితే అరెస్టుల భయంతో నాడు రెచ్చిపోయిన పలువురు కార్యకర్తలు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు. నాడు అనంతపురం క్లాక్ టవర్ దగ్గర పరిటాల ఫ్యామిలీపై తొడకొట్టి మీసం మెలేసిన కళ్లం హరిప్రసాద్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు రెస్టు చేయడంతో తత్వం బోధపడినట్లుంది. అందుకే సోషల్ మీడియాలో ఎవరూ అసభ్య పోస్టులు పెట్టొద్దని సూచించారు. నేతలు బాగానే ఉంటారని.. కేసులు బుక్ అయితే నష్టపోయేది సామాన్యులేనని చెప్పుకొచ్చారు. నటి శ్రీరెడ్డి కూడా ఇంతే. నాడు లోకేశ్, పవన్ కల్యాణ్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఇప్పుడు సారీ చెప్తూ క్షమించాలని వీడియో విడుదల చేశారు. అయితే సారీ చెప్పినంత మాత్రాన వదిలిపెట్టొద్దని పలువురు కోరుతున్నారు. నాడు అధికారం అండ చూసుకుని రెచ్చిపోయిన ఎంతోమంది వైసీపీ అభిమానులకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్టుంది. అందుకే పశ్చాత్తాపం చెందుతున్నట్టు అర్థమవుతోంది. పశ్చాత్తాపం చెంది ఇకనైనా మారితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. కేసుల నుంచి బయటకు రాగానే మళ్లీ రెచ్చిపోతే మాత్రం కష్టమే.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :