YS Jagan: జగన్‌లో ఎంత మార్పు..? అప్పుడే ఇలా చేసి ఉంటే..!!?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓడిపోయింది. అది కూడా సాధారణ ఓటమి కాదు. ఘోర పరాజయం. 2019లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన ఆ పార్టీ.. 2024లో 11 స్థానాలకు పరిమితమై చరిత్రను తిరగరాసింది. ఈ ఫలితాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఖతమైపోవడం ఖాయమనుకున్నారు. ఆ పార్టీ ఇంక బతకడం కష్టమనుకున్నారు. అయితే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. పార్టీని గాడిలో పెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అన్నిటికీ తాను ముందుంటూ శ్రేణులను నడిపిస్తున్నారు.
వైఎస్ జగన్.. ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో ఒక సంచలనం. వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కొడుకుగా అందరికి పరిచయమైనా.. తండ్రి లేకపోయినా సత్తా చాటుతున్నారు. సొంత పార్టీ పెట్టి అనతికాలంలోనే అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ (Congress Party) లాంటి జాతీయ పార్టీని ఎదుర్కొని నిలబడగలగడం అంత ఈజీ కాదు. కానీ దాన్ని జగన్ సాధ్యం చేసి చూపించారు. కనివినీ ఎరుగని మెజారిటీ సాధించి 2019లో అధికారంలోకి వచ్చారు. అయితే ఐదేళ్లకే జగన్ ఇంటిదారి పట్టక తప్పలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఇందుకు అనేక కారణాలున్నాయి.
పార్టీ కేడర్ (Party Cadre) ను జగన్ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు.1 కనీసం సెక్రటేరియేట్ (secretariat) కు కూడా పోకుండా తాడేపల్లి (Tadepalli) క్యాంప్ ఆఫీసులో (Camp Office) కూర్చుని బటన్ నొక్కుతూ ఉండిపోయారు. వాలంటీర్లు, సచివాలయాలే అన్నీ చూసుకుంటాయనే భ్రమల్లో ఉండిపోయారు. కనీసం ఎమ్మెల్యేలకు (MLAs) కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయారు. కోటరీ చుట్టూ ఉండిపోయారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును (Script), తన అనుకూల మీడియాతో (Media) మాట్లాడుతూ ఒక చట్రంలో ఇమిడిపోయారు. ఎంత పెద్ద సంఘటన జరిగినా ఆయన మీడియా ముందుకు రాలేదు.
కానీ ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది. అధికారం పోయిన వెంటనే ప్రజల్లోకి రావడం మొదలు పెట్టారు. మీడియాతో మాట్లాడేందుకు సమయం కేటాస్తున్నారు. నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. నాడు ఎమ్మెల్యేలను కలిసేందుకే జగన్ సమయం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎంపీటీసీలను (MPTC) కూడా పిలిపించుకుని మంచీచెడూ మాట్లాడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు కాకుండా సొంతంగా మీడియా ముందు మాట్లాడగలగుతున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇప్పటివరకూ జగన్ మూడు సార్లు మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లిలో ఉంటే ప్రతిరోజూ కొంతమంది నేతలను పిలిపించుకుని చర్చిస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇలా చేసి ఉంటే ఇలాంటి ఫలితాలు వచ్చి ఉండేవి కాదేమోనని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.