ASBL NSL Infratech

జగన్ లో మార్పు వచ్చేనా..?

జగన్ లో మార్పు వచ్చేనా..?

ఏపీ విపక్షనేత జగన్ చాలా ధృడమైన సంకల్పబలం ఉన్న వ్యక్తి.. చాలా విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. ఆమొండితనం ఉండబట్టే అపరచాణక్యుడు లాంటి చంద్రబాబును..2019 ఎన్నికల్లో మట్టి కరిపించి 151 సీట్లతో అధికారం సాధించారు. అయితే ఆ తర్వాత తీసుకున్న పలుప్రజావ్యతిరేక నిర్ణయాల ఫలితంగా.. దారుణ ఓటమి చవిచూశారు. ఏకంగా 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు శాసనసభలో విపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. అయితే జగన్ మాట్లాడే విధానం చూస్తే.. దీనికంత ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు.

అంతే కాదు...ఆయన వైఖరి చూస్తే మళ్లీ పాదయాత్ర చేసి సీఎం అయిపోవాలి అన్నట్లుంది. ఇంకా ఐదేళ్ల సమయం ఉంది కాబట్టి చంద్రబాబు తప్పకుండా మళ్లీ ప్రజల్ని విసిగిస్తారు. దీంతో ప్రజలు మళ్లీ మనకే ఓటేసి, మీరే సీఎంగా ఉండండి మహాప్రభో అంటారని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు సైతం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కానీ.. విపక్షనేతగా సభలో అధికార పక్షాన్ని నిలదీసే ఉద్దేశం జగన్ లో కనిపించడం లేదు. సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరై, తర్వాత రాజకీయక్షేత్రంలో ఉండాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ వైఖరి అలా ఉంటే.. ఇక వైసీపీ ఎమ్మెల్యేల సంగతి చెప్పక్కరలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుంటే.. సభలో అధికార కూటమి ఆడింది ఆట పాడింది పాట అన్నమాట.

ప్రజల్ని కోపగించుకోవద్దు.. వారు చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయారని జగన్ .. కేడర్ కు చెబుతున్నారు. ఇక్కడే జగన్ ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అంత అమాయకులు కాదు. తమకేమి కావాలో.. ఏమి వద్దో.. ఎవరు తమకు సరైన పాలన అందిస్తారో ప్రజలకు తెలిసినంతగా ఆఖరుకు నేతలకు తెలియదు. అందుకే ఓసారి ఆపార్టీని, మరోసారి ఈపార్టీని అందలమెక్కిస్తున్నారు. ఐదేళ్లపాటు వారి పాలనను చూసిన తర్వాత బేరీజు వేసుకుని ఓటేస్తున్నారు. అంతేకానీ.. ఏవో నాలుగు పథకాలు అందిస్తున్నాం కాబట్టి మనకే ఓటేస్తున్నారనుకోవడం భ్రమే.

తొలిసారి పాదయాత్రకు వెళ్లినప్పుడు ఒక్కఛాన్స్ ప్లీజ్ అని ప్రజల్ని ఓట్లు అభ్యర్థించారు జగన్. అప్పుడు కుటుంబసభ్యులు ఆయన వెంటే మద్దతుగా ఉన్నారు. వైఎస్ బిడ్డ అడుగుతున్నాడన్న సానుభూతితో ఓట్లు గుద్దారు. ఇప్పుడు ఆసానుభూతి కుదరదు. మీకు ఐదేళ్లపాటు అధికారమిచ్చారు. మీపాలన చూశారు. తమకు నచ్చలేదని కుండబద్దలు కొట్టారు. అప్పుడు ఇంకా మీరు ఈ రాష్ట్రంలో రాజకీయపోరాటంలో ఉండాలంటే.. మీరు మీ విధానాలు మార్చుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. వారికి ఏమివ్వడంలో మనం తక్కువచేశాం. కాదు పొరబడ్డాం అన్న విషయంపై ఆత్మావలోకనం చేసుకోవాలి. అంతే కానీ మంచి చేశాం.. ఈసారి ప్రజలు తప్పు చేసినా, మళ్లీ మనల్నే గెలిపిస్తారనుకోవడం కరెక్టు కాదు. ముఖ్యంగా జగన్ ఓ సమర్థ విపక్షనేతగా వ్యవహరించాలన్నది ప్రజాతీర్పు వెనక ఉన్న ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. దీన్ని జగన్ గ్రహిస్తే వైసీపీకి మంచిది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :